పేపర్ పులిలా రంకెలేయొద్దు.. బండి సంజయ్‌కి రేవంత్ రెడ్డి కౌంటర్

తనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పేపర్ పులుల్లా టీవీల ముందు రంకెలేయొద్దంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీలు బీజేపీకి జేబు సంస్థలేనని.. మరి కేసీఆర్‌పై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని రేవంత్ నిలదీశారు. 

tpcc chief revanth reddy counter to telangana bjp president bandi sanjay

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంత వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. దీనిని బట్టే బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఒక్కటేననే విషయం స్పష్టమవుతోందన్నారు. రెండు పార్టీలు కలిసి దోచుకుంటున్నాయని ఆరోపించారు బండి సంజయ్.  ఈ క్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. అవినీతి ఆరోపణలు వచ్చిన రాజయ్యను బర్తరఫ్ చేసిన కేసీఆర్ , ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ ఇష్యూపై మౌనంగా వున్న కేసీఆర్.. బండి సంజయ్‌కి కనిపించడం లేదా అని రేవంత్ నిలదీశారు. బండి సంజయ్ , కిషన్ రెడ్డి పేపర్ పులుల్లా టీవీల ముందు రంకెలేయొద్దంటూ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్ అవినీతిపై తాను ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేపట్టలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. బండి సంజయ్ కరీంనగర్‌లో పోటీ చేస్తాడా లేదా అని తాను అడిగానని ఆయన గుర్తుచేశారు. కరీంనగర్ శాసనసభ స్థానంలో గంగుల కమలాకర్‌తో కుమ్మక్కై అక్కడ పోటీ చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బండి సంజయ్‌కి చిత్తశుద్ధి వుంటే.. కరీంనగర్‌లో పోటీ చేస్తాడా లేదా అనేది చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 9 ఏళ్లలో కేసీఆర్ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ప్రధాని మోడీ , హోంమంత్రి, ఆర్ధిక మంత్రి , పరిశ్రమల శాఖ మంత్రి, బీజేపీ అధ్యక్షుడు చెప్పారని రేవంత్ గుర్తుచేశారు. కేంద్రంలో ప్రభుత్వం మీదేనని .. సీబీఐ, ఈడీ, ఐటీలు బీజేపీకి జేబు సంస్థలేనని.. మరి కేసీఆర్‌పై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని రేవంత్ నిలదీశారు. 

Also Read: కవిత తీరుతో మహిళలు తలదించుకొనే పరిస్థితి: బండి సంజయ్

మరోవైపు రేవంత్ రెడ్డి ఎట్టకేలకు ఢిల్లీ లిక్కర్ స్కాంపై స్పందించారు. లిక్కర్ కేసును పక్కదారి పట్టించేందుకే ఢిల్లీలో కవిత దీక్ష చేపట్టారని ఆయన ఆరోపించారు. అలాగే అదానీ స్కాంపై చర్చ జరగకుండానే ఈ ప్లాన్ చేశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఐదేళ్లు ఎంపీగా వున్న కవిత రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు వస్తే కొడుకైనా, కూతురైనా సరే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని కేసీఆర్ అన్నారని రేవంత్ గుర్తుచేశారు. అవినీతి ఆరోపణల నెపంతో డిప్యూటీ సీఎంగా వున్న రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారని రేవంత్ అన్నారు. మరి కవితపై అలాంటి చర్యలు లేవా అని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios