తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  అసెంబ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుందని ... వరంగల్‌లో బహిరంగ చర్చకు సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు 

మంత్రి కేటీఆర్ (ktr) విసిరిన రాజీనామా సవాల్‌పై స్పందించారు టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) . రాజీనామా చేసిన వెంటనే ఎన్నికల కలెక్షన్ గురించి మాట్లాడతారని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ (trs) రాజీనామాలు త్యాగం కాదని.. తెలంగాణకు ఎవరు ఏం చేశారో చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమంలో తాను ఎక్కడున్నానని అడుగుతున్నారని.. అసెంబ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుందని కౌంటరిచ్చారు. వరంగల్‌లో బహిరంగ చర్చకు సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు. 

ప్రజలు ఆనాడు తిరుగుబాటు బావుటా ఎగరేశారు కాబట్టే తెలంగాణ రాచరికం నుంచి విడుదలైందన్నారు టీపీసీసీ చీఫ్ . రాహుల్ గాంధీ (rahul gandhi) సూచన మేరకు, సోనియా గాంధీ ఆదేశాల మేరకు వరంగల్ నడిబొడ్డున సభ పెట్టాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం పెడుతున్న సభ కాదని రేవంత్ చెప్పారు. చెరకు ఫ్యాక్టరీలు మూసివేయడం వల్లే నిజామాబాద్‌లో రైతులు వరివేస్తున్నారని ఆయన తెలిపారు. రైతులకు వరి తప్ప వేరే పంట వేయలేని పరిస్ధితులు కల్పించారని రేవంత్ ఆరోపించారు. 

పత్తి పండిస్తే నష్టం వస్తోందని రైతులు వరి వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర టీఆర్ఎస్‌దని రేవంత్ మండిపడ్డారు. మిర్చి వేసినా దళారుల దందాతో గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్లే రైతులు వరి వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు వరి వైపు మళ్లారని రేవంత్ దుయ్యబట్టారు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని కేసీఆర్ ప్రకటనలు చేశారని గుర్తుచేశారు. 

ఎక్సైజ్ ఆదాయం పెంచుకోవడానికి ఇంటింటికీ, సందు సందుకీ బెల్ట్ షాపులు పెట్టారని రేవంత్ ఫైరయ్యారు. రైతుల్ని గంజాయి పండించేలా ఉసిగొల్పుతున్నారని.. తెలంగాణ సంస్కృతిని కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. ప్రజల్ని వ్యసనాలకు బానిసలు చేసిన చరిత్ర కేసీఆర్ కుటుంబ సభ్యులదని రేవంత్ అన్నారు. డ్రగ్స్, గంజాయి, పబ్బుల సంస్కృతిని తీసుకొచ్చారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ క్రైం వెనుకా టీఆర్ఎస్ నేతలే వుంటున్నారని రేవంత్ ఫైరయ్యారు. పబ్బుల్లో దొరికిన దొంగల రక్త నమూనాలను సేకరించకుండా విడుదల చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.