ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తెలంగాణను దిగజార్చారని కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. జీతాల కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న వేతన జీవులే దీనికి సాక్ష్యమని తెలిపారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంక్షోభంలో చిక్కుకుందా? అని ప్రశ్నించారు. నాడు రూ.16 వేల కోట్ల మిగులుతో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్.. కేసీఆర్ చేతుల్లో పెట్టిందని రేవంత్ గుర్తుచేశారు. కానీ నేడు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. జీతాల కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న వేతన జీవులే దీనికి సాక్ష్యమని తెలిపారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అంతకుముందు తెలంగాణ బీజేపీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పవర్ అంతా ఢిల్లీ చేతిలోనే వుందని.. రాష్ట్ర బీజేపీ కమిటీకి పవర్ లేదంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎదుగుదలను అడ్డుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. బండి సంజయ్ గల్లీలో కేసీఆర్‌ను తిడుతున్నాడని.. ఢిల్లీలో బీజేపీ నేతలతో కేసీఆర్ తిరుగుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్, అమిత్ షా ఆటలో బండి సంజయ్ బలికాక తప్పదని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. ఢిల్లీ నుంచి ఏడేళ్లుగా ఎన్ని నిధులు తెచ్చారో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారం కాపాడుకోవడానికే బీజేపీతో దోస్తీ చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేపీ తెలంగాణ నాయకులు డమ్మీలని.. బండి సంజయ్ బకరా నెం 1, ఈటల రాజేందర్ బకరా నెం .2 అంటూ ఆయన దుయ్యబట్టారు.