Asianet News TeluguAsianet News Telugu

నిఖత్ జరీన్‌కు రూ.5 లక్షల నజరానా ప్రకటించిన రేవంత్ రెడ్డి.. వాళ్లలాగే ఈమెకు ఇవ్వండి, కేసీఆర్‌కు విజ్ఞప్తి

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి భారతదేశానికి, తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచిన నిఖత్ జరీన్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రూ.5 లక్షలు నజరానా ప్రకటించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమెను తగిన విధంగా గౌరవించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. 

tpcc chief revanth reddy announced prize money to nikhat zareen
Author
Hyderabad, First Published May 22, 2022, 8:05 PM IST

ప్రపంచ బాక్సింగ్  ఛాంపియన్ షిప్‌లో  స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రూ.5 లక్షల నజరానా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. నిజామాబాద్ నుంచి ఇస్తాంబుల్ వరకు జరీన్ ప్రయాణం ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని రేవంత్ ప్రశంసించారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్, సానియా మీర్జాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పారితోషికం ఇచ్చినట్లు నిఖత్ జరీన్‌కు కూడా అందించాలని సీఎం కేసీఆర్‌ను ఆయన కోరారు. 

కాగా.. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఏ) ఆధ్వర్యంలో  టర్కీ రాజధాని ఇస్తాంబుల్ వేదికగా ఆదివారం ముగిసిన మహిళల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్స్ లో జరీన్.. 5-0 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన జిట్పాంగ్ ను చిత్తుచిత్తుగా ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.  తద్వారా ఈ పతకం గెలిచిన తొలి తెలుగు, తెలంగాణ అమ్మాయిగా నిలిచింది. ఫైనల్ పోరు ఆరంభం నుంచి  ముగిసేవరకు ప్రత్యర్థికి ఏమాత్రం కూడా కోలుకునే అవకాశం ఇవ్వకుండా.. బలమైన పంచ్ లతో విరుచుకుపడింది. 

తెలంగాణ లోని ఇందూరు (నిజామాబాద్) కు చెందిన నిఖత్ జరీన్ ఇక్కడివరకు రావడానికి చాలా కష్టపడింది. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నిఖత్.. ఇందూరు నుంచి ఇస్తాంబుల్ చేరడానికి  పుష్కర కాలం కృషి దాగి ఉంది. ఆ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం. 

13 ఏండ్లకే తొలి పంచ్..

నిజామాబాద్ కు చెందిన మహ్మద్ జమీల్ అహ్మద్-పర్వీన్ సుల్తానాలకు కలిగిన నలుగురి సంతానంలో  మూడో అమ్మాయి జరీన్. జమీల్.. పొట్టకూటి కోసం గల్ఫ్ లో కొన్నాళ్లు సేల్స్ ఆఫీసర్ గా పని చేసి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. చిన్నప్పట్నుంచే బాక్సింగ్ మీద మక్కువ పెంచుకున్న జరీన్.. 13 ఏండ్లలో తన ఈడు పిల్లలంతా  వీధుల వెంబడి  ఆడుకోవడానికి వెళ్తే తాను మాత్రం చేతులకు బాక్సింగ్ గ్లౌజులు వేసుకుంది. 

నిజామాబాద్ లోని షంసముద్దీన్ దగ్గర బాక్సింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన ఆరు నెలలకే  ఆమె తన ప్రతిభ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. 2010 లో కరీంనగర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ లో  గోల్డ్ మెడల్ నెగ్గింది. కొద్దిరోజుల్లోనే ఆమె జాతీయ స్థాయిలో కూడా పలు టోర్నీలలో పతకాలు నెగ్గింది. తర్వాత ఆమె.. విశాఖపట్నంలోని ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐవీ రావు దగ్గర శిక్షణ తీసుకుంది. 2010లోనే  ఈరోడ్ (తమిళనాడు) లో జరిగిన  నేషనల్ ఛాంపియన్స్ లో ‘గోల్డెన్ బెస్ట్ బాక్సర్’ అవార్డు పొందింది. 

సాధించిన ఘనతలు.. 

- 2011 లో ఇదే టర్కీలో  ముగిసిన ఏఐబీఏ ఉమెన్స్ జూనియర్ అండ్ యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ఆమె స్వర్ణం నెగ్గింది. 
- 2014లో యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్.. 
- 2015 లో అసోంలో ముగిసిన 16వ  సీనియర్ ఉమెన్  నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ లో  గోల్డ్ మెడల్. 
- 2019 లో బ్యాంకాక్ లో  జరిగిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ లో  సిల్వర్ మెడల్ 
- 2019, 2022  స్ట్రాంజ మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలలో స్వర్ణం. 

Follow Us:
Download App:
  • android
  • ios