మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీ ప్రభుత్వంలో వీఆర్ఒల (vro) పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందంటూ ఎద్దేవా చేశారు. గొడ్డు చాకిరీ చేయించుకుని… వాళ్ల హక్కులను కాలరాస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ (congress)- టీఆర్ఎస్ (trs) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) కేసీఆర్ పాలనపై (kcr) మండిపడుతున్నారు. తాజాగా మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీ ప్రభుత్వంలో వీఆర్ఒల (vro) పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందంటూ ఎద్దేవా చేశారు. గొడ్డు చాకిరీ చేయించుకుని… వాళ్ల హక్కులను కాలరాస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలీ చాలని జీతాలు … ఏళ్ల తరబడి ప్రమోషన్లు లేక వీఆర్ఒల పరిస్థితి దుర్భరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఒలకు పే స్కేల్ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అమలు చేయడంలేదని రేవంత్ దుయ్యబట్టారు. హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయాలన్న సోయి మీకు లేదంటూ టీపీసీసీ చీఫ్ చురకలు వేశారు.

శేషాద్రి కమిటీ ఓ కంటి తుడుపు చర్య అన్న రేవంత్ రెడ్డి... వీఆర్ఒలకు తక్షణం పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వీఆర్ఒలకు పదోన్నతులు కల్పించాలని, వాళ్లకు సొంత గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని రేవంత్ కోరారు. విధి నిర్వహణలో చనిపోయిన వీఆర్ఒల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు . తెలంగాణ ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసి 16 నెలలు గడుస్తోందని... రాష్ట్రంలో విధులు లేకుండా ఐదు వేల 756 మంది వీఆర్వోలు ఖాళీగా ఉన్నారని రేవంత్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తమకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు వీఆర్వోలు.

మరోవైపు ... తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి స్పందించారు. సోమవారం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి ఇష్యూ తమ దృష్టికి వచ్చిందన్నారు. పార్టీ పెద్దలు జగ్గారెడ్డితో మాట్లాడుతున్నారని తెలిపారు. జగ్గారెడ్డి అధిష్టానాన్ని అపాయింట్‌మెంట్ కోరారని.. జగ్గారెడ్డికి తామంతా అండగా ఉంటామని రేవంత్ చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. 

గతంలో వీహెచ్‌పై కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని రేవంత్ చెప్పారు. పీసీసీ చీఫ్‌గా కొన్ని విషయాలు తాను బయటకు చెప్పలేనని అన్నారు. జగ్గారెడ్డి తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని రేవంత్ తెలిపారు. జగ్గారెడ్డి విషయంలో పార్టీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీకి రాజీనామాకు సిద్దమైన జగ్గారెడ్డిని పలువురు సీనియర్ నేతలు బుజ్జగించడంతో.. ఆయన తన నిర్ణయాన్ని 15 రోజులు వాయిదా వేశారు. అదే సమయంలో కాంగ్రెస్ సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఆయన లేఖ రాశారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌తోనే జగ్గారెడ్డి సమస్య ఉన్నది బహిరంగ రహస్యమే. సోనియా, రాహుల్‌కు రాసిన లేఖలో కూడా రేవంత్ రెడ్డిపై పరోక్షంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.