హైదరాబాద్: మంత్రి వర్గ విస్తరణ తర్వాత అనూహ్యంగా ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో అసంతృప్తి బయటపడింది. మంత్రివర్గ విస్తరణకు ముందు మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాత్రమే కాస్తా నిరసన గళం వినిపించారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత నిరసన గళాలు పెరిగాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీ తర్వాత ఆ అసంతృప్తి సెగలు మరింతగా ఎగిసే ప్రమాదం ఉంది.

మంత్రివర్గ విస్తరణకు ముందు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు కొన్ని సర్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ నిరసన గళాలు వినిపించాయి. కడియం శ్రీహరి, నాయిని నర్సింహా రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటివారికి ఉన్నత పదవులు ఇస్తానని, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలకు తగిన స్థానాలు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

అదే రోజు సెప్టెంబర్ 8వ తేదీన ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను శాసనసభ చీఫ్ విప్ గా, ఎమ్మెల్సీ  బి. వెంకటేశ్వర్లుకు శాసన మండలి చీఫ్ విప్ పదవి ఇచ్చారు. కొంత మంది ఎమ్మెల్యేలను విప్ లుగా నియమించారు. ప్రస్తుతం పార్టీలో అసంతృప్తి సెగలను చల్లార్చడానికి నామినేటెడ్ పోస్టులను కేసీఆర్ చూపిస్తున్నారు. 

క్యాబినెట్ హోదా గల నామినేటెడ్ పోస్టులు కొన్ని మాత్రమే ఉంటాయి. దాదాపు 50 మంది శాసనసభ్యులు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసి), రైతు సమన్వయ సమితి చైర్మన్ వంటి కొన్ని మాత్రమే కాబినెట్ హోదా పోస్టులున్నాయి. 

వాటికి తోడు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసి) చైర్మన్ పదవి త్వరలో ఖాళీ కానుంది. పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పదవిని ఎం శ్రీనివాస్ రెడ్డికి, ప్రణాళిక సంఘం చైర్మన్ పదవిని వినోద్ కుమార్ కు ఇచ్చారు. ఈ స్థితిలో ఆశావహుల కోరికలను పూర్తి స్థాయిలో తీర్చడం కేసీఆర్ కు అంత సులభం కాదనేది అర్థమవుతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తయిన తర్వాత టీఆర్ఎస్ లో అసంతృప్తి పూర్తి స్థాయిలో బయటపడుతుందని అంటున్నారు.