హైదరాబాద్: కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ విధింపు కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అంతర్రాష్ట్ర ఆర్టీసి సర్వీసులు కూడా నిలిచిపోయాయి. అయితే ఇటీవల లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర అంగీకారం మేరకు అంతర్రాష్ట్ర బస్ సర్వీసులను నడుపుకోవచ్చని కేంద్రం వెసులుబాటు కల్పించింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల మధ్య బస్ సర్వీసులను ప్రారంభించాలని ఇరు రాష్ట్రాల ఆర్టీసి అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం చర్చించేందుకు రేపు(బుధవారం) హైదరాబాద్ లో ఇరురాష్ట్రాల ఆర్టీసి ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. 

ఈ సమావేశంలో అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై  ఓ స్పష్టత వచ్చే అవకాశం వుంది. గతవారం విజయవాడలో సమావేశమైన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఏపీ-తెలంగాణల మధ్య నాలుగు దశల్లో ఆపరేషన్స్ ప్రారంభించాలని నిర్ణయించారు. మరిన్ని విషయాలపై చర్చించేందుకు మరోసారి హైదరాబాద్ లో ఇరు రాష్ట్రాల ఆర్టీసి అధికారులు సమావేశం కానున్నారు. 

read more   ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసి బస్సులు... కరోనా పరీక్షల తర్వాతే విధుల్లోకి సిబ్బంది

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల మధ్య  తిరిగి ఆర్టీసీ  సర్వీసులు ప్రారంభించే విషయానికి సంబంధించి ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య  విజయవాడలో ఇదివరకే చర్చలు జరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపడంపై రెండు రాష్ట్రాల అధికారులు కూలంకషంగా చర్చించారు. తెలంగాణాలో ఏపీ బస్సులకు ఎన్ని కిలోమీటర్లు తిరిగే అవకాశం కల్పిస్తే... అన్నే కిలోమీటర్లు ఏపీలో తెలంగాణ బస్సులు తిరుగుతాయని ఒక ప్రాథమిక ఒప్పందానికి వచ్చినట్టు తెలిపారు.  ఏది ఏమైనా వారం రోజుల్లో తెలంగాణ, ఏపీ మధ్య బస్సులను ప్రారంభించాలని ఈ సమావేశంలో అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. 

అంతర్ రాష్ట్ర సర్వీసులపై ప్రాథమిక చర్చలు జరిగాయని, రెండు రాష్ట్రాల మధ్య 4 దశల్లో ఆపరేషన్స్  స్టార్ట్ చేయాలని నిర్ణయానికొచ్చామని ఏపీ ఎస్ ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానంద రెడ్డి  తెలిపారు. తొలుత 256 సర్వీసులు ఏపీ నుంచి తెలంగాణకు నడపాలని నిర్ణయించి తెలంగాణ అధికారులకు ఇందుకు సంబంధించి ప్రపోసల్ పంపించామని, వచ్చే వారంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య  అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్నారు. 

కిలోమీటర్ ప్రాతిపదికగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించామని, కోవిడ్ నిబంధనలు ప్రకారమే బస్సులు నడుపుతామని తెలిపారు. ప్రోటోకాల్ తప్పక పాటిస్తామని స్పష్టం చేసారు. స్టేట్ అగ్రిమెంట్ విషయంలో ఇరు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు చర్చ జరగలేదని, అవకాశం వచ్చింది గనుక ఇప్పుడు ఆ విషయంపై కూడా చర్చ జరిపామని బ్రహ్మానంద రెడ్డి అన్నారు.