తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

హైదరాబాద్‌: తెలంగాణ నుండి రాయలసీమ, దక్షిణ తమిళనాడు, దక్షిణ కర్ణాటక మీదుగా సముద్రమట్టానికి 0.9కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సోమవారం ఇది గాంగెటిక్‌ పశ్చిమ బెంగాల్‌ పరిసర ప్రాంతాల్లో ఉండి, సముద్ర మట్టం నుంచి 5.8 కిలో మీటర్ల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ(మంగళవారం) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

ఇప్పటికే గత రెండురోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. గత ఆదివారం మోస్తరు వర్షాలు కురియగా సోమవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

సోమవారం రాత్రి అత్యధికంగా మెదక్ జిల్లాలోని చిట్కుల్ లో 14సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యింది. హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాలో కూడా కుండపోత వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ లో 12సెం.మీ, భువనగిరిలో 10.03సెం.మీ, పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో 9.08సెంమీ వర్షపాతం నమోదయ్యింది. 

ఇక హైద్రాబాద్ నగరంలోని పలు చోట్ల సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైద్రాబాద్ పాతబస్తీలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సికింద్రాబాద్ , ముషీరాబాద్, బోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడీగూడ, ఇందిరా పార్క్, దోమలగూడ, విద్యానగర్, అడిక్ మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

బోయిన్‌పల్లి, చిలకలగూడ, మారేడ్‌పల్లి, బేగంపేట, ప్యాట్నీ సెంటర్. ప్యారడైజ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వరద పోటెత్తింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జాం ఏర్పడింది.