టీఎన్జీవో నేతలు రాష్ట్రమంత్రి హరీష్ రావును కలిశారు. హెల్త్ స్కీం కోసం మూలవేతనంలో ఒక శాతం కంట్రిబ్యూట్ చేయాలని పీఆర్సీ తెలిపిందని, కానీ, తాము అదనంగా మరో శాతం ఇస్తామని టీఎన్జీవో నేతలు చెప్పారు. అయితే, ఉద్యోగులకు, పెన్షనర్లకు మెరుగైన వైద్యం అందించాలని, ఇకపై అన్ని కార్పొరేట్ హాస్పిటల్‌లలో తమకు ఇక నుంచి ఉచితంగా వైద్యం అందించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని వివరించారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును టీఎన్జీవో సెంట్రల్ కమిటీ నేతలు కలిశారు. టీఎన్జీవో సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, జనరల్ సెక్రెటరీ ప్రతాప్ తదితరులు మంత్రిని కలిసి హెల్త్ స్కీంపై విజ్ఞప్తులు చేశారు. తెలంగాణ ఉద్యోగుల హెల్త్ స్కీం, పెన్షనర్ల హెల్త్ స్కీంను ట్రస్ట్ బోర్డు ద్వారా అమలు చేయాలని మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్టు టీఎన్జీవో నేతలు వివరించారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ హామీపై టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, జనరల్ సెక్రెటరీ ప్రతాప్ హర్షం వ్యక్తం చేశారు.

మంత్రి హరీష్ రావును కలిసిన అనంతరం వారు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. పీఆర్సీ కమిటీ నివేదికలో.. హెల్త్ స్కీం కోసం ఉద్యోగులు తమ జీతం నుంచి ఒక్క శాతం మూల వేతనం ఇవ్వాలని తెలిపిందని వివరించారు. ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ 7 శాతం మాత్రమే జీతాలు పెంచాలని పేర్కొందని గుర్తు చేశారు. కానీ, అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ వ్యవహరించారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఉద్యోగ పక్షపాతి అని, కాబట్టే ఆయన ఏడు శాతం అనే సూచన పక్కనపెట్టి 30 శాతం పీఆర్సీ ఇచ్చారని వివరించారు.

సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షాన ఉంటారని, అందుకే తాము కూడా ముఖ్యమంత్రికి తోడ్పాటుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు టీఎన్జీవో నేతలు తెలిపారు. తమ వంతుగా పీఆర్సీ కమిటీ హెల్త్ స్కీంకు ఒక్క శాతం ఇవ్వాలని చెప్పినా.. తాము అదనంగా మరో ఒక శాతం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. సీఎంకు తోడ్పాటుగా ఉండాలని 2 శాతం కంట్రిబ్యూట్ చేయాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్‌లకు మెరుగైన వైద్యం అందించాలని తాము గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు
నివేదించామని వారు చెప్పారు. అందుకోసం తాము పీఆర్సీ కమిటీ సూచించిన మూలవేతనంలో ఒక శాతం కాకుండా రెట్టింపుగా అంటే రెండు శాతం మూల వేతనం కంట్రిబ్యూట్ చేస్తామని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తాము మంత్రి హరీష్ రావును కలిశామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ హాస్పిటల్‌లలో తమకు ఇక నుంచి ఉచితంగా వైద్యం అందించాలని కోరామని వివరించారు. ఈ విజ్ఞప్తిపై మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు.