తెలంగాణ ఇంటర్ బోర్డ్ అవకతవకలపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మండిపడ్డారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇంటర్ ఫలితాల గందరగోళంపై విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బోర్డులో జరుగుతున్న తప్పుడు విధానాలపై ప్రభుత్వం బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో చివరికి హైకోర్టును కూడా తప్పుదారి పట్టించారని కోదండరామ్ ఆరోపించారు.

ఇంటర్ బోర్డు తీరుపై అఖిలపక్ష నేతలమంతా గవర్నర్‌ను కలుస్తామని కోదండరామ్ తెలిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు పెద్దలే ఈ సమస్యకు బాధ్యులమని ఆయన ఆరోపించారు.

బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు ఇంటర్ బోర్డును పోలీస్ స్టేషన్‌గా మార్చారని దుయ్యబట్టారు. గ్లోబరీనా సంస్థ పేరు గతంలో ఎప్పుడూ వినలేదని.. ఇంటర్ డేటాను ఎంటర్ చేసే సామర్ధ్యం ఆ సంస్థకు ఉందనే విషయంలో అనుమానంగా ఉందని అభిప్రాయపడ్డారు. గ్లోబరీనా ఈ ఏడాది ఆరంభం నుంచి తప్పిదాలే చేస్తూ వస్తోందని కోదండరామ్ మండిపడ్డారు.