హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రశేఖర్ రావు, చంద్రబాబు నాయుడుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరువురు నేతలు విమర్శలు దాడి చేసుకుంటున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు తెలంగాణలో పర్యటించడం కేసీఆర్ అసలు సహించలేదు. 

చంద్రబాబు పర్యటనను టార్గెట్ చేస్తూ అనేక సభలలో దుమ్మెత్తిపోశారు. అయితే చంద్రబాబు సైతం కేసీఆర్ పై విమర్శించుకోవడంతో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబుకు అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ చెప్పారు. ఇప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్ తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

అయితే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఓటమే ధ్యేయంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ స్పందించారు. ఏపీలో కేసీఆర్ పర్యటిస్తే చంద్రబాబు నాయుడుకే లాభమంటూ జోస్యం చెప్పారు. 

మరోవైపు కూటమి ఓటమికి ఈవీఎంలే కారణమన్నవాదన సరైంది కాదని కోదండరామ్‌ అభిప్రాయపడ్డారు. కూటమి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామన్నారు. ప్రచారానికి కనీసం 50 రోజులు కావాలని చెప్పానని అయితే 3 వారాలు చాలని కాంగ్రెస్, టీడీపీ నేతలు వాదించారన్నారు. 

తాను లోక్‌సభకు పోటీ చేసే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు కోదండరామ్. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్తానన్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరల్‌ఫ్రంట్‌కు అవకాశం లేదన్నారు. ఫెడరల్‌ఫ్రంట్ ఎవరి కోసమో కేసీఆర్‌కే తెలియాలి అంటూ కోదండరామ్ ఎద్దేవా చేశారు.