హైదరాబాద్: తెలంగాణలో జోనల్ వ్యవస్థను సవరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ చెప్పారు.

మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. టీచర్, పోలీస్ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని  తెలంగాణ  ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ విషయమై  ఆయన ఇవాళ స్పందించారు.

మూడేళ్లుగా టెట్ రాలేదు, టీచర్ పోస్టులు ఎలా భర్తీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయయని నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఉద్యోగాల భర్తీపై నమ్మకం లేదన్నారు. ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. 

2013-14 లో 2.7 శాతం నిరుద్యోగ రేటు ఉంటే ఇప్పుడు 8 శాతానికి పెరిగిందన్నారు.ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కలు ఉంటాయని ఆయన తెలిపారు.  ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయమై ప్రత్యేకించి కమిటీలు అవసరం లేదని చెప్పారు.

వచ్చే ఏడాదిలో తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలను పురస్కరించుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.