బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగాలని తుమ్మల నాగేశ్వరరావు భావించారు. అయితే ఇటీవల బీఆర్ఎస్‌ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. తుమ్మలను పక్కకు పెట్టారు. దీంతో తుమ్మల తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలోనే తుమ్మల తన ప్రధాన అనుచరులతో సమావేశం నిర్వహించారు. తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా?, ఏదైనా పార్టీ నుంచి బరిలో దిగుతారనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. 

దీంతో తుమ్మల రాజకీయ భవిష్యత్‌ ఏమిటనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాదరణ ఉన్న నేతగా గుర్తింపు పొందిన తుమ్మలను.. తమ పార్టీల్లో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు కూడా తెర వెనక ప్రయత్నాలు జరిపాయి. తుమ్మలకు బీజేపీ ఆహ్వానం పంపినప్పటికీ.. ఆయన అనుచరులు మాత్రం ఆ పార్టీలోకి వద్దని సూచించినట్టుగా చెబుతున్నారు. 

ఇక, ఉమ్మడి ఖమ్మంపై స్పెషల్ ఫోకస్‌ పెట్టిన కాంగ్రెస్‌ తుమ్మలను పార్టీలో చేర్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాలు కూడా ఫలించే దిశగానే సాగుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు చేరికను ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలు మల్లు భటి విక్రమార్క, రేణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. తాజాగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. బేషరతుగా పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని తెలిపారు. 

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కూడా తుమ్మల కాంగ్రెస్‌లోకి వస్తే అందరం స్వాగతిస్తామని అన్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరితే పార్టీ మరింతగా బలోపేతం అవుతుందని.. ఆయన ఉమ్మడి జిల్లాను ఎంతో అభివద్ది చేశారని పేర్కొన్నారు. 

అయితే ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు కూడా పార్టీ మార్పుపై ఓ క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరాలని తుమ్మల నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సెప్టెంబర్ మొదటి వారంలో రేవంత్‌తో పాటు ఢిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతుంది. ఈరోజు తన ముఖ్య అనుచరుల భేటీలో కూడా ఈ విషయంపై తుమ్మల చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలాఉంటే, కొద్ది రోజుల్లోనే పాలేరు నియోజకవర్గంలో భారీ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.