వేడి వేడి సాంబారులో పడి మూడేళ్ల చిన్నారి మృతి  చెందింది. పొరపాటున సాంబారు గిన్నెలో పడటంతో చిన్నారి చనిపోయింది. ఈ దారుణ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు గురుకుల పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గద్వాల జిల్లా గట్టు గురుకుల పాఠశాలలోని మానవపాడుకి చెందిన గురుకుల విద్యాలయాన్ని గట్టుకు తరలించారు. అందులో అయిజ మండలం చిన్నతాండ్రపాడకు చెందిన లక్ష్మీ అనే మహిళ కేర్ టేకర్ గా పనిచేస్తోంది. ఆమెకు మూడేళ్ల కుమార్తె రిష్మిక(3) ఉంది. విధులకు తనతోపాటు తన కుమార్తెను కూడా లక్ష్మీ రోజూ తీసుకువస్తూ ఉంటుంది.

కాగా... బుధవారం మధ్యాహ్నం లక్ష్మీ విద్యార్థులకు భోజనం వడ్డించే సమయంలో రిజిస్టర్ లో పేర్లు నమోదు చేసే పనిలో ఉండి... కుమార్తె సంగతి మరిచిపోయింది. ఈ సమయంలో చిన్నారి రష్మిక ఆడుకుంటూ వెళ్లి వేడి వేడి సాంబారు గిన్నెలో పడింది. మధ్యాహ్నం భోజనంలో భాగంగా చిన్నారులకు వడ్డించాల్సిన సాంబారు గిన్నె అక్కడ ఉండగా.... రష్మిక వెళ్లి పొరపాటున పడిపోయింది.

తీవ్రగాయాలపాలైన చిన్నారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. కాగా.. చిన్నారి మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.