వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. థారూర్ మండలం రాజాపూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పిడుగుపాటుకు గురై దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఫక్రుద్దీన్ సోమవారం తన కుటుంబసభ్యులతో కలిసి పొలంలో పనులు చేస్తున్నాడు.

ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పక్కనే ఉన్న షెడ్డులోకి వెళ్లి నిల్చున్నారు. ఈ సమయంలో వారు ఉన్న చోట పిడుగు పడింది. ఈ ప్రమాదంలో ఫక్రుద్దీన్ భార్య ఖాజాబి, కూతురు తబాసం, కుమారుడు అక్రమం అక్కడికక్కడే మరణించారు.

ఫక్రుద్దీన్ పరిస్ధితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదే ప్రమాదంలో ఫక్రుద్దీన్‌కు చెందిన రెండు మేకలు కూడా మరణించాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.