భద్రాద్రి: ఎండ వేడిమికి తట్టుకోలేక సరదాగా చెరువులో ఈతకు దిగిన ఓ యువకుడు నీటిలో మునిగి మృత్యువాతపడ్డాడు. అతడిని కాపాడటానికి ప్రయత్నించిన మరో ఇద్దరు కూడా ప్రాణాలను కోల్పోయారు. ఇలా ఒక్కరి ఈత సరదా ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్న విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన నల్లమోతు అప్పారావు కొడుకు తేజ్, మేనల్లుడు వినయ్ ని తీసుకుని పొలం వద్దకు వెళ్లారు. అయితే తేజ్ సరదాగా పొలం పక్కనే ఉన్నరేపాక చెరువులోకి ఈతకు దిగాడు. అయితే లోతు ఎక్కువగా వుండటంతో మునిగిపోయాడు. 

ఈ క్రమంలో అతడికి కాపాడటానికి నీటిలోకి దిగిన అప్పారావు కూడా మునిగిపోయాడు. వీరిద్దరికి కాపాడటానికి ప్రయత్నించి వినయ్ కూడా మునిగిపోయాడు. ఇలా ముగ్గురు జలసమాదయ్యారు. ఒక్కడి ఈత సరదా ఇలా ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న గ్రామస్తులు మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

ఇలా ఒకే రోజు ఒకే కుటంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు. కట్టుకున్న భర్త, కన్న కొడుకును కోల్పోయిన  మహిళ శోకం గ్రామస్తులను కన్నీరు పెట్టిస్తోంది. మిగతా కుటుంబసభ్యులు కూడా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.