నల్లగొండ: తెలంగాణలోని నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. కారు ముందు తుక్కు తుక్కు అయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 

మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు చిన్నారులు క్షేమంగా ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి హైదరాబాదుకు వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ఉన్నారు. 

గాయపడినవారిని చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి సమీపంలో గల కొత్తపల్లికి చెందినవారు. ఘటనా స్థలానికి చేరుకున్న నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి పంచనామా నిర్వహించి మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

తూర్పు గోదావరి జిల్లా గోక వరం మండలం కొత్త పల్లి కి చెందిన గిరిశాల శ్రీనివాస్‌ (45) కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్‌ కు బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు చిట్యాల మండలం వట్టిమర్తి శివారు లో జాతీయ రహదారి పక్కన ధాన్యం లోడు తో ఆగి ఉన్న లారీని  వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్‌ తో పాటు ఆయన భార్య లక్ష్మీ (30) తో పాటు మరో లక్ష్మీ చందన (28) అక్కడిక్కడే దుర్మరణం చెందారు.