దైవదర్శనం చేసుకుని వెళుతుండగా కారు ప్రమాదానికి గురయి ఐదేళ్ల బాలుడు సహా ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.
వేములవాడ : దైవదర్శనానికి వెళ్లివస్తుండగా ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఐదేళ్ల బాలుడితో సహా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా తన సొంత వాహనంలో వారిని హాస్పిటల్ కు తరలించి మానవత్వాన్ని చాటుకున్నాడు బిఆర్ఎస్ నేత. ఈ దుర్ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు, క్షతగాత్రులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ పట్టణానికి చెందిన ఓ కుటుంబం శనివారం ఉదయం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి కారులో వెళ్లారు. స్వామి వారి దర్శనం అనంతరం సాయంత్రం తిరుగపయనం అయ్యారు. ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న కారు కరీంనగర్ జిల్లాలోని కథలాపూర్ వద్ద రోడ్డుప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో కారులోని రాకేష్, నరేష్ తో పాటు ఐదేళ్ళ బాలుడు నందు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద సమయంలో అదే మార్గంలో వెళుతున్న బిఆర్ఎస్ నేత గోలి మోహన్ గాయపడిన వారిని చూసి చలించిపోయారు. అంబులెన్స్ కోసం ఎదురుచూడకుండా వెంటనే తన వాహనంలో క్షతగాత్రులను కథలాపూర్ లోని హాస్పిటల్ కు తరలించారు. ఇలా సాటి మనుషులకు సాయం చేసి మానవత్వం చాటుకున్నారు బిఆర్ఎస్ నేత.
