జగిత్యాల జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
జగిత్యాల జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాలు.. వెల్గటూర్ మండలం కిషన్‌రావుపేట సమీపంలో వేగంగా వెళ్తున్న కారు.. ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు ఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక, మృతులను ధర్మపురి మండలం కమలాపూర్‌కు చెందినవారిగా గుర్తించారు. ఇక, కారు కరీంనగర్ నుంచి వెల్గటూరు వైపు, ఆటో ధర్మపురి నుంచి ధర్మారం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతిచెందిన వారంతా ఆటోలో ప్రయాణిస్తున్నవారే.
ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు నలుగురు మరణించారు. 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. ఇటావా అడ్మినిస్ట్రేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. స్లీపర్ బస్సు 46 మంది ప్రయాణికులతో గోరఖ్‌పూర్ నుండి అజ్మీర్ షరీఫ్‌కు వెళుతోంది. ఆ బస్సు సైఫాయ్ సమీపంలో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఉండగా డ్రైవర్ నిద్రపోయాడు. దీంతో వాహనం నియంత్రణ కోల్పోయింది. దీంతో ముందు ఇసుక లోడుతో వెళ్తున్న లారీని ఢీకొట్టింది.
ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ప్రయాణికులను బస్సులో నుంచి బయటకు తీశారు. సైఫాయ్‌లోని పీజీఐ హాస్పిటల్ కు తరలించారు. బస్సులో ఉన్న 42 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
