తెలంగాణలో మూడు రోజులు వర్షాలు, ఈదురుగాలులు..
తెలంగాణలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. మూడు రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణలోరానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వర్షాలతో పాటు పలు ప్రాంతాలలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇక హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41 డిగ్రీల వరకు నమోదవుతాయని పేర్కొంది. ఓవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు.. విచిత్రమైన వాతావరణం హైదరాబాదులో నెలకొంది. పగటిపూట హైదరాబాదులో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షం కురిసింది. ఓవైపు ఎండ కొడుతుండగానే.. వర్షం ఒక్కసారిగా కురియడంతో.. రోడ్లమీద వెళ్లేవారు తీవ్ర ఇబ్బంది పాలయ్యారు. ఇలాగే రేపు ఎల్లుండి కూడా.. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని.. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.