హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలను ప్రకటించిందో లేదో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే ఆశావాహుల ఆందోళనలతో ఇటు గాంధీభవన్ అటు ఢిల్లీలు దద్ధరిల్లుతున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి దాదాపుగా ఇద్దరేసి ముగ్గురేసి పోటీ పడటంతో అభ్యర్థులను ఎంపిక చెయ్యడం కాంగ్రెస్ ఓ మినీ యుద్ధమే చెయ్యాల్సి వచ్చింది. 

నియోజకవర్గాల కోసం అభ్యర్థులు పోటీ పడుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకే ఊరికి మూడు టిక్కెట్లు కేటాయించింది. ఆగండి ఆగండి నియోజకవర్గానికి కదా పోటీ చేసేది. ఒకే ఊరికి ముగ్గురు అభ్యర్థులు ఏంటనేగా మీ డౌటు. అదేనండీ ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఎవరా లక్కీ పర్సన్స్ అనుకుంటున్నారా ఇంకెవ్వరు కోమటిరెడ్డి బ్రదర్స్ మరియు చిరుమర్తి లింగయ్యలు. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్యలకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించింది. వీరిది నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బ్రహ్మణ వెల్లంల గ్రామం. ముగ్గురు నేతలు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 

అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మెుదటి జాబితాలో ఈ ముగ్గురికి టిక్కెట్లు కేటాయించింది అధిష్టానం. అయితే మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండ టిక్కెట్ ఇప్పటి వరకు ఐదుసార్లు కేటాయించింది. ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గం కేటాయించారు. 

కోమటిరెడ్డి బ్రదర్స్ కు ముఖ్య అనుచరుడుగా ఉన్న చిరుమర్తి లింగయ్యను నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఒకే గ్రామానికే మూడు టిక్కెట్లు దక్కినట్లు అయ్యింది. ఒకానొక దశలో నకిరేకల్ టిక్కెట్ చిరుమర్తి లింగయ్యకు ఇచ్చేందుకు పీసీసీ అంగీకరించలేదు. 

దీంతో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెద్ద రాద్ధాంతమే చేశారు. చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే తమకు వద్దంటూ పేచీ పెట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ దిగొచ్చింది. కాదు కాదు కాంగ్రెస్ పార్టీ ముక్కు పిండి మరీ టిక్కెట్ దక్కించుకున్నారు. 

అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మెుదటి జాబితాలోనే వీరికి టిక్కెట్లు దక్కడం విశేషం. మెుదటి జాబితాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా వారిలో కోమటిరెడ్డి బ్రదర్స్, చిరుమర్తి లింగయ్యలు ఉన్నారు.