Asianet News TeluguAsianet News Telugu

క్రైమ్ రౌండప్: వివాహిత కిడ్నాప్, నెలన్నరపాటు గ్యాంగ్‌రేప్.. మరిన్ని వార్తలు

పెళ్లయిన ఓ యవతిని నలుగురు గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి.. రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆమె వద్దనున్న నగలు, నగదును దోచుకుని తమ వద్దే బంధించారు. ప్రతిరోజు మత్తు పదార్థాలు ఇచ్చి నెలన్నర పాటు.. రోజుకో చోటుకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

this week crime report
Author
Hyderabad, First Published Sep 15, 2019, 1:32 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పరిగిలో నిండు గర్భిణీ సజీవదహనం కేసులో.. ప్రియుడే నిందితుడు
 
వికారాబాద్ జిల్లా పరిగిలో సజీవదహనమైన నిండు గర్బిణి కేసును పోలీసులు చేధించారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన జయ ప్రభు శామ్యూల్ కుమార్తె ఎస్తేర్ రాణి... డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుండేది.

ఆమెను ఓ యువకుడు ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకోవడంతో రాణి గర్భం దాల్చింది. విషయం బయటకు తెలిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించాడు.

అది వికటించడంతో యువతి మృతి చెందింది. దీంతో భయపడిపోయిన సదరు ప్రేమికుడు.. రాణితో పాటు శిశువు మృతదేహాన్ని ఓ కారులో తీసుకొచ్చి పరిగి మండలం రంగంపల్లి శివారులోని రహదారి పక్కన పడేశాడు. అనంతరం మృతదేహాలపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు.

స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్రంలోని మిస్సింగ్ కేసులు.. సీసీఫుటేజీల సాయంతో విచారణ ప్రారంభించారు.

ఈ వివరాలను పొరుగున ఉన్న కర్ణాటక పోలీసులకు సైతం అందించడంతో చిక్కుముడి వీడింది. ఘటన జరిగిన రోజే గుల్బర్గాకు దగ్గరలోని బ్రహ్మాపూర్ పీఎస్‌లో ఓ మిస్సింగ్ కేసు నమోదయ్యింది.

అక్కడి పోలీసులు తమ మిస్సింగ్ కేసుతో ఇక్కడి వివరాలను చూసుకుని కనిపించకుండా పోయిన యువతిగా గుర్తించారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు స్థానిక పోలీసులు కర్ణాటకకు వెళ్లారు. 


వివాహిత కిడ్నాప్.. నెలన్నరపాటు గ్యాంగ్‌రేప్

రాజస్థాన్‌లో ఓ వివాహితను కిడ్నాప్ చేసిన దుండగులు నెలన్నరపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. జూలై 20వ తేదీన పెళ్లయిన ఓ యవతిని నలుగురు గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి.. రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు.

ఆమె వద్దనున్న నగలు, నగదును దోచుకుని తమ వద్దే బంధించారు. ప్రతిరోజు మత్తు పదార్థాలు ఇచ్చి నెలన్నర పాటు.. రోజుకో చోటుకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

దీంతో వివాహిత గర్భం దాల్చింది. ఓ రోజు స్పృహ వచ్చి తనను నిర్బంధించిన ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించి అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 


యువతి ప్రాణం తీసిన బ్యానర్

పెండ్లి వేడుక కోసం ఏర్పాటు చేసిన బ్యానర్ కారణంగా ఓ యువతి నిండు ప్రాణం కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. పల్లావరం రెడియల్ రోడ్డులోని పళ్లికరణై వద్ద శుభశ్రీ అనే యువతి స్కూటర్‌పై వెళుతోంది. ఈ క్రమంలో ఓ మాజీ కౌన్సిలర్ ఇంట్లో పెళ్లి వేడుక కావడంతో బ్యానర్ ఏర్పాటు చేశారు.

ఈదురుగాలుల కారణంగా అది నేలకొరిగి.. స్కూటర్ మీద పడటంతో ... వాహనం అదుపు తప్పి శుభశ్రీ రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ఆమె మీదుగా వెళ్లింది. దీంతో శుభశ్రీ ఘటనాస్థలంలోనే కన్నుమూసింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి దుర్మరణంతో అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదే పదే ఈ మార్గంలో రాజకీయ పార్టీల నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, పోలీసులు వీటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడ్డారు. 


అక్రమ సంబంధం: భారతీయుడిని చంపిన పాక్ పౌరుడు

తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో ఓ పాక్ జాతీయుడు.. భారతీయుడిని హత్య చేశాడు. యూకే పౌరసత్వం కలిగి ఉన్న పాక్ జాతీయుడు పెర్విజ్.. భారత్‌లోని హైదరాబాద్‌కు చెందిన నదీమ్ ఉద్దీన్ హమీద్ మొహమ్మద్‌లు లండన్‌లోని ఓ కార్యాలయంలో కలిసి పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో నదీమ్.. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పెర్విజ్ అనుమానిస్తూ వచ్చాడు. ఇది బాగా ముదిరిపోవడంతో ఈ ఏడాది మే నెలలో రోడ్డుపై వేలాది మంది ప్రజలు చూస్తుండగానే నదీమ్‌ను పెర్విజ్ కత్తితో పొడిచి చంపాడు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. క్రౌన్ కోర్టులో హాజరుపరిచారు. పెర్విజ్‌కు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పదునైన ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు మరో 18 నెలల శిక్ష కూడా విధించింది.

తీర్పు సమయంలో.. మీ భార్య, కుటుంబసభ్యులు, మరణించిన మొహమ్మద్‌లు నువ్వు తప్పుగా అర్ధం చేసుకుంటున్నావని ఎంత చెప్పినా వినలేదంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాగా పెరోల్ కోసం దరఖాస్తు  చేసుకోవాలంటే 22 నెలల శిక్షను అనుభవించాలని జడ్జి తెలిపారు. 


ప్రియుడితో కలిసి భర్తను చంపిన జవాన్ భార్య

ఆర్మీ జవాన్ సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతి కేసును విశాఖ పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి అతని భార్యే సతీశ్‌ను హతమార్చినట్లు పోలీసులు నిర్థారించారు.

వివరాల్లోకి వెళితే.. విశాఖకు చెందిన సతీశ్ సైన్యంలో పనిచేస్తూ... విధి నిర్వహణలో భాగంగా జమ్మూకాశ్మీర్‌లో ఉన్నాడు. ఇతనికి భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

భర్త దూరంగా ఉండటంతో జ్యోతి... భరత్ కుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమె ప్రవర్తనపై సతీశ్ కుమార్ తల్లికి అనుమానం కలగడంతో కోడలిని మందలించింది.

కొద్దిరోజుల తర్వాత సతీశ్ సెలవుపై ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో జ్యోతి అక్రమ సంబంధం గురించి తెలుసుకుని భార్యను నిలదీశాడు. తన వివాహేతర సంబంధం తెలిసిపోవడంతో భర్తను హతమార్చాలని జ్యోతి.. తన ప్రియుడితో కలిసి పథకం వేసింది.

కుట్రలో భాగంగా సతీశ్ తాగే విస్కీలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. భర్త నిద్రమత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడు భరత్, అతని స్నేహితుడు భాస్కర్‌లకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది.

ముగ్గురు కలిసి సతీశ్ మెడకి చున్నీ బిగించి హత్య చేశారు. అనంతరం అదే చున్నీతో ఫ్యాన్‌కి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఏం తెలియనట్లుగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు మృతదేహం తీరుపై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో జ్యోతి, భరత్, భాస్కర్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios