Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ వ్యూహం:రంగంలోకి అల్లు అర్జున్, చిరంజీవి

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు కదుపుతున్నారు. ఎలాగైనా గెలవాలని కసితో ఉన్నారు. దీపావళి తర్వాత సినీనటులను తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారట. 

This KCR may get support from Allu Arjun and Chiaranjeevi
Author
Hyderabad, First Published Nov 5, 2018, 3:51 PM IST

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు కదుపుతున్నారు. ఎలాగైనా గెలవాలని కసితో ఉన్నారు. దీపావళి తర్వాత సినీనటులను తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారట. స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్, మెగా స్టార్ చిరంజీవిలతో ప్రచారం చేయించి ఓట్లు దండెయ్యాలని ప్లాన్ కూడా వేస్తున్నారట. 

కేసీఆర్  ఏంటి, స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవిలను ప్రచారంలోకి దింపడమేంటి అనే కదా మీ డౌట్. నిజమే కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన్ను కూడా కేసీఆర్ అనే పిలుస్తారు. ఈ కేసీఆర్ అలియాస్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లుడే స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్. 

గత ఎన్నికల్లో కె.చంద్రశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తరపున ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అయినా నియోజకవర్గంలో తనదైన పాత్ర పోషిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన నేపథ్యంలో ఆయనకు ఈసారి టిక్కెట్ కేటాయించలేదు కేసీఆర్.

 తెలంగాణ అసెంబ్లీ రద్దు అనంతరం కేసీఆర్ ప్రకటించిన 105 నియోజకవర్గాల జాబితాలో ఇబ్రహీం పట్నం కూడా ఉంది. కానీ ఆ నియోజకవర్గానికి అభ్యర్థిని మాత్రం మార్చేశారు. కేసీఆర్ ను కాకుండా వేరొకరికి కేటాయించారే టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కేసీఆర్ తనకు టిక్కెట్ కేటాయించకపోడంతో కె.చంద్రశేఖర్ రెడ్డి చాలా ఆగ్రహంతో ఉన్నారు. 

తాను ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీలోనే  ఉన్నానని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైనా టీఆర్ ఎస్ కార్యకర్తగా ప్రజలకు చేరువలోనే ఉన్నానని తెలిపారు. తనకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు జూ.కేసీఆర్.  

గతంలో ఇబ్రహీం పట్నం నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థి కరువయ్యారని అలాంటి సమయంలో తనని పిలిచి పోటీ చెయ్యాలని ఆదేశిస్తే పోటీ చేశానన్నారు. ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయంలోనే తాను పోటీ చేశానన్నారు. అయితే ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో తెలంగాణ వాదం అంతగా ఉండేది కాదని, టీఆర్ఎస్ పార్టీకి కూడా అంతగా సానుకూలత లేదని అందువల్లే తాను ఓటమి చెందానన్నారు.

ఇండస్ట్రీస్ లో ఉద్యోగులు దక్కవు, భూముల రేట్లు పడిపోతాయి, పరిశ్రమలు తరలిపోతాయి అన్న ఆందోళనలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రజలు భయపడేవారు. అందువల్లే ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ కు అంతగా సానుకూలత లేకుండా పోయిందని అదే తన కొంపముంచిందని చెప్పారు. 

తాను గత ఎన్నికల్లో ఓటమి చెందినా తాను నిత్యం నియోజకవర్గ ప్రజలతో అందుబాటులో ఉన్నానని టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేశానని అయితే తనకు కాకుండా టీటీపీ నుంచి వలస వచ్చిన అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వడం తానే కాదు నియోజకవర్గ ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. 

అంతేకాదు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇబ్రహీం పట్నంలో ఇంజనీరింగ్ కళాశాలు పెట్టి నిరుపేదలు ఉన్నత విద్యనభ్యసించేందుకు అవకాశం కల్పించానని తెలిపారు. తన లక్ష్యం ప్రజలకు సేవ చెయ్యడమేనన్నారు. 

టీఆర్ఎస్ పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వని నేపథ్యంలో ఇతర పార్టీలు తనను ఆహ్వానిస్తున్నాయని ఇప్పటికే తనతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారన్నారు. అటు నియోజకవర్గంలో  కార్యకర్తలు సైతం తనపై ఒత్తిడి పెంచుతున్నారని కె.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అలాగే తన కుటుంబ సభ్యులు కూడా పోటీ చెయ్యాలని ఒత్తిడిపెంచుతున్నారని తెలిపారు. 
కుమార్తెలు, అల్లుల్లు కూడా తాను పోటీ చేస్తే వాళ్లు తమ మద్దతు ప్రకటిస్తామని హామీ ఇస్తున్నారని తెలిపారు. తాను కూడా అమవాస్య తరువాత కార్యకర్తలు, మెగాఫ్యామిలితో భేటీ అయి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానన్నారు.

తన పరిధిలో ఉన్న సేవలతో పాటు ప్రభుత్వం తరపున సేవ ప్రజలకు అందాలంటే అందుకు రాజకీయం కూడా అవసరమన్నారు. అందువల్లే తాను నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి తనకు మనోధైర్యాన్ని ఇచ్చారన్నారు. 

ఎన్నికల్లో ఓడిపోయినా  ప్రజలతో నిత్యం మమేకమై ఉండాలని ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తారని చెప్పారన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై మెగా ఫ్యామిలీతో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. 
 
తాను ఎన్నికల్లో పోటీ చేస్తే తన తరపున స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవులు కూడా కలిసి ప్రచారం చేసే అవకాశం ఉందని తెలిపారు. దీపావళి అనంతరం తన రాజకీయ భవిష్యత్ పై ప్రకటన చేస్తానన్నారు. తాను ఎట్టిపరిస్థితుల్లో పోటీ చేసి తీరుతానని చెప్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios