బ్యాంకు దోపిడీకి ప్లాన్ వేసి.. పోలీసు లాకప్‌లోకి వెళ్లినట్టు.. బ్యాంకు బయటి నుంచి తాళం వేయడంతో గిలగిల..
నిజామాబాద్‌లో ఓ దొంగ బ్యాంకు చోరీకి ప్లాన్ వేశాడు. బ్యాంకులోపలికి దూరాడు. కానీ, సైరన్ మోగడంతో సిబ్బందితోపాటు స్థానికులూ అలర్ట్ అయ్యారు. స్థానికులు ఆ బ్యాంకుకు బయటి నుంచి తాళం వేయడంతో దొంగ లోపలే గిలగిలలాడాడు. పోలీసులు ఆ దొంగను స్టేషన్‌కు పట్టుకెళ్లారు.
డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా ఆ దొంగ అనుకున్నది ఒకటైతే, అయినది మరొక్కటి. బ్యాంకులోకి వెళ్లినట్టే వెళ్లి.. పోలీసు లాకప్‌లో ప్రత్యక్షమైనట్టుగా ఆ దొంగ పరిస్థితి మారింది. దొంగతనానికి వెళ్లగానే.. సైరన్ రావడంతో అప్రమత్తమైన స్థానికులు బ్యాంకు బయటి నుంచి తాళాలు వేశారు. దీంతో దొంగ లోపలే గిలగిలలాడిపోయాడు. పోలీసులు వచ్చి సింపుల్‌గా ఆ దొంగను స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఏం చేద్దామనుకుంటే.. ఏం జరిగిందా? అని షాక్‌కు గురవ్వడం దొంగ వంతైంది.
ఈ ఘటన నిజామాబాద్‌లో జరిగింది. ధర్పల్లి మండలంలోని దుబ్బాకలో ఇండియన్ ఒవర్సీస్ బ్యాంక్ ఉన్నది. ఈ బ్యాంక్‌ను టార్గెట్ చేసిన దొంగ సోమవారం రాత్రి అందులోకి దూరాడు. కానీ, బ్యాంకుల్లో ఉండే భద్రతా వ్యవస్థ, అలర్ట్ సిస్టమ్ గురించి బహుశా ఆ దొంగకు తెలియదేమో.. దొంగ బ్యాంకులోకి దూరిన తర్వాత ఒక్కసారిగా సైరన్ మోగింది. దీంతో బ్యాంకు సిబ్బంది అలర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం చేరవేశారు.
స్థానికులూ చాకచక్యంగా వ్యవహరించారు. బ్యాంకులో దొంగతనానికి ఓ దొంగ వెళ్లినట్టుగా వాళ్లు గుర్తించారు. వారు ఆ దొంగను ఎదుర్కోవాలనే నిర్ణయానికి భిన్నంగా.. స్మార్ట్‌గా జస్ట్ షట్టర్‌కు లాక్ వేశారు. ఆ దొంగ బయటకు వచ్చే మార్గం మూసుకుపోయింది. ఆ దొంగ ఖంగారులో ఉండగానే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. సునాయసంగా దొంగను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు పట్టుకెళ్లారు.