హైదరాబాద్: హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన నిజాం మ్యూజియం చోరీ కేసును సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. పదిరోజుల్లో కేసును ఛేదించిన పోలీసులకు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. హాలీవుడ్ మూవీ తరహాలో దొంగతనానికి పాల్పడటమే కాకుండా ఎంజాయ్ చేశారని, దొంగతనం తర్వాత ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో విలాస వంతమైన జీవితాన్ని గడిపారని తెలిపారు. రెండు రోజులపాటు బంగారు టిఫిన్ బాక్స్ లో మూడు పూటలా విందు ఆరగించి సంబరపడిపోయినట్లు పోలీస్ కమిషనరన్ అంజనీకుమార్ తెలిపారు.  

మూడు అంచెలుగా నిర్మితమైన బంగారు టిఫిన్ బాక్స్ లో మూడు పూటలా విందు ఆరగిస్తూ సంబరపడిపోయారట. ఒక లక్ష రూపాయలు ఖరీదు చేసే ఒక్కో డైమండ్ తో టిఫిన్ బాక్స్ ను నిజాం కాలంలో తయారు చేశారు. ఈ బంగారు టిఫిన్ బాక్స్ విలువ ఇప్పటికి ఎవరూ అంచనా వేయలేదు. అంతటి ఖరీదైన బంగారు టిఫిన్ బాక్స్ లో నిజాం నవాబులు విందు ఆరగించారో లేదో తెలియదు కానీ ఈ దొంగలు మాత్రం ప్రతీరోజు విందు ఆరగిస్తూ ఎంజాయ్ చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. 

ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పది రోజుల్లో ఛేదించారు. చోరీ కేసును ఛేదించేందుకు 22 బృందాలను నియమించినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ 22 బృందాల్లో 11 బృందాలు దొంగలు ఎలా లోపలికి చొరబడ్డారని మరో బృందం ఎలా బయటకు వెళ్లారన్న కోణంలో తొలుత అధ్యయనం చేసినట్లు తెలిపారు. 

మ్యూజియం దొంగతనం కేసులో దొంగలు చాలా తెలివిగా వ్యవహరించినట్లు పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.సెప్టెంబర్ 2 రాత్రి దొంగలు మహ్మద్ గౌస్ పాషా, మహ్మద్ ముబీలు మ్యూజియం పై కప్పు నుంచి తాడు సాయంతో లోపలికి దిగారు. మ్యూజియంలోని కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గదిపై బాగంలో ఉన్న కిటికీలు తొలగించి దొంగతనం అనంతరం బయటకు వెళ్లిపోయారు.  

దొంగతనం సమయంలో మ్యూజియం నుంచి బంగారు ఖురాన్ కూడా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు దొంగలు. అయితే ఆ సమయంలో ఫజర్ కా అజాన్ వినిపించడంతో వారు ఖురాన్ ను అక్కడే వదిలేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. 

అయితే దొంగతనం చేసేటప్పుడు లోపలికి తాడు సాయంతో వెళ్లడంతో నిందితులు సన్నగా ఉంటారని గుర్తించారు పోలీసులు. అలాగే బయటకు వెళ్లేటప్పుడు ఒక కిటీకీ సాయంతో బయటకు రావడంతో కిటికీ కూడా వెడల్పు తక్కువగా ఉండటంతో నిందితులు సన్నగా ఉండటం వాస్తవమేనని గుర్తించారు. అలాగే దొంగతనం తర్వాత ఎలా వెళ్లారు అన్న కోణంలో విచారించిన పోలీసులకు పెద్ద సవాల్ ఎదురైంది. 

దొంగతనం జరిగినటువంటి  పరిసర ప్రాంతాల్లో ఎక్కడా సీసీ కెమెరాలో ఫేస్ కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు 32 ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలలో వారి ఆచూకీ కనిపెట్టడం సాధ్యం కాలేకపోయింది. మ్యూజియంకు చేరుకునే 18 మార్గాలు అన్వేషించినా అక్కడ కూడా ఆచూకీ కనుక్కోలేకపోయారు. అయితే  ఒక సీసీ కెమెరాలో వీడియో ఫుటేజీలో నిందితుల జాడ కనిపించినప్పటికీ వారి ముఖం కనుగొనడం అసాధ్యంగా మారింది. తెల్లవారు జాము కావడం, మంచు నుంచి తప్పించుకునేందుకు ముఖానికి మఫ్లర్ కట్టుకోవడంతో అసలు నిందితుల ఛాయ కూడా కనిపెట్టలేకపోయారు.  
 
మరోవైపు మెుబైల్ ఫోన్ వినియోగించి ఉంటారేమోనన్న అనుమానంతో 300 సెల్ టవర్స్ ప్రయత్నించారు. అయితే ఒక చోట ఫోన్ వినియోగించినట్లు తెలిసినా నంబర్ కనుక్కోవడం సాధ్యపడలేదు. పాత నేరస్థుల జాబితాలోనూ ఎలాంటి క్లూ దొరకలేదు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఒక సీసీ ఫుటేజ్ లో ఇద్దరు బైక్ పై వచ్చి ఒక్కసారిగా నిలిపివేయడం గమనించారు. 

రేడియేటర్ ప్రోబ్లమ్ వారు చెక్ చేసినట్లు గుర్తించారు.  అదే బైక్  జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండటం గమనించారు. అక్కడ కూడా రేడియేటర్ ప్రాబ్లం ఎదురవ్వడం గమనించారు. రెండు చోట్ల కనిపించిన బైక్ ఒకటే కావడం...ఇద్దరు స్లిమ్ గా ఉండటంతో పోలీసులు కేసును ఛేదించారు.  

దొంగతనం అనంతరం నిందితులు ఇద్దరు ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్ లో దిగినట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆ హోటల్ లో రెండు రోజులపాటు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. మూడు పూటలా కోట్లాది రూపాయలు విలువ చేసే బంగారు టిఫిన్ బాక్స్ లో విందు ఆరగిస్తూ ఎంజాయ్ చేశారు. దుబాయి మార్కెట్లో ఈ బంగారు టిఫిన్ బాక్స్ ను 30 నుంచి 40 కోట్లకు అమ్మెయ్యాలని ప్రయత్నించారు. అయితే కుదరకపోవడంతో  తిరిగి హైదరాబాద్ తిరిగి వచ్చేసినట్లు తెలిపారు.

ఈ చోరీలో 25 ఏళ్ల మహ్మద్ గౌష్ పాషా కీలక పాత్ర పోషించాడని పోలీసులు తెలిపారు. ఇతను 26 కేసుల్లో నిందితుడు. నిజాం మ్యూజియం దొంగతనానికి ముందు పలు దొంగతనాల కేసులో జైలు జీవితం గడిపి విడుదలయినట్లు తెలిపారు. రెండు నెలల క్రితం సందర్శకుడిలా మ్యూజియంలోకి ప్రవేశించాడని అప్పటి నుంచి బంగారు టిఫిన్ బాక్స్ ను దొంగిలించాలని ప్లాన్ చేశాడని తెలిపారు. ప్లాన్ వచ్చిందే తడవుగా ఆ ప్రాంతంలో రెక్కీ కూడా నిర్వహించినట్లు తెలిపారు.