వీడెవడో వింత దొంగలా వున్నాడే..! భార్య నైటీ వేసుకుని, సవరం పెట్టుకుని సొంతింట్లోనే చోరీ (వీడియో)
వీడెవడో వింత దొంగలా వున్నాడు... భార్య నైటీ వేసుకుని, సవరం పెట్టుకుని అచ్చం మహిళలా మారి సొంతింట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ వింత చోరీ సిరిసిల్ల నియోజకవర్గంలో చోటుచేసుకుంది.

సిరిసిల్ల : భార్య సవరం, నైటీ వేసుకుని అచ్చం మహిళలా మరాడు ఆ ఇంటి యజమాని. తన సొంత భవనంలోనే దొంగతనానికి పాల్పడేందుకు ఇలా మహిళ గెటప్ వేసాడు. ఈ వింత చోరీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది. సొంత భవనంలోనే చోరీ చేసినా పోలీసులకు చిక్కకుండా వుండేందుకు ఆ యజమాని దొంగతెలివి ప్రదర్శించాడు. కానీ దొంగతనం చేసింది ఆమె రూపంలో వున్న అతడని గుర్తించిన పోలీసులు యజమానిని అరెస్ట్ చేసారు.
పోలీసుల కథనం ప్రకారం... సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో రామిండ్ల నాంపల్లి భవనంలో కొన్ని షాపులు నడుస్తున్నాయి. ఇలా సింగారం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ఈ భవనంలోనే ప్లెక్సీ ప్రింటింగ్ కేంద్రం నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఈ నెల 9వ తేదీ రాత్రి షాప్ ను మూసేసి తాళం వేసి వెళ్లిపోయాడు లక్ష్మీనారాయణ. తర్వాత రోజు ఉదయం తిరిగి షాప్ తెరవగా వెనకాల తలుపు తెరిచివుంది. షాప్ లో వుంచిన కొంత నగదు కూడా కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో ఎల్లారెడ్డిపేట పోలీసులు రంగంలోకి దిగారు.
వీడియో
దొంగతనం జరిగిన ప్లెక్సీ ప్రింటింగ్ షాప్ ను సిసి కెమెరా వుండటంతో అందులో రికార్డయిన ఫుటేజీని చూసి పోలీసులు షాకయ్యారు. ఓ మహిళ దొంగతనం చేస్తున్నట్లుగా వీడియో బయటపడటంతో ఆమెకోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కానీ ఎంతకూ ఈ మహిళా దొంగ దొరక్కపోవడంతో పోలీసులు మరో కోణంలో దర్యాప్తు చేపట్టారు. దీంతో దొంగతనానికి పాల్పడింది మహిళ కాదు మారువేషంలో వున్న పురుషుడని గుర్తించారు.
Read More ఆస్తి పంపకాల కోసం దాయాదుల అమానవీయం.. చనిపోయి రెండు రోజులైనా ఇంటిముందే మృతదేహం..
బయటి వ్యక్తులకు షాప్ వెనకనుండి దారి వున్నట్లు తెలిసే అవకాశం లేదు... కాబట్టి ఇది పక్కా ఆ షాప్ గురించి తెలిసినవారి పనే అయివుంటుందని పోలీసులకు చిన్న అనుమానం కలిగింది. దొంగతనం జరిగిన షాప్ చుట్టుపక్కల ఆరాతీయగా భవన యజమాని చిన్నకొడుకు సుధీర్ పై అనుమానం వ్యక్తం చేసారు. జల్సాలకు అలవాటుపడిన అతడే ఈ పని చేసివుంటాడన్న వారి అనుమానమే నిజమయ్యింది. సుధీర్ ను పట్టుకుని విచారించగా ఈ దొంగతనం చేసింది తానేనని ఒప్పుకున్నాడు.
తనపై అనుమానం రాకుండా వుండేందుకే భార్య సవరం, డ్రెస్ ధరించి దొంగతనానికి పాల్పడినట్లు సుధీర్ తెలిపాడు. షాప్ లో సిసి కెమెరా వుందని తెలిసే ముఖం కనిపించకుండా జాగ్రత్తపడి గుర్తుతెలియని మహిళ ఈ దొంగతనం చేసినట్లు నమ్మించే ప్రయత్నం చేసానని చెప్పాడు. ఇంత రిస్క్ చేసి సొంత భవనంలో సుధీర్ దొంగిలించింది ఎంతో తెలుసా... 3,500 రూపాయలు. తండ్రి ఎంతో విలువైన ఆస్తులు సంపాదించి పెట్టినా సుధీర్ మాత్రం జల్సాలకు అలవాటుపడి ఇలా చిల్లర దొంగగా మారాడు.
ఎట్టకేలకు దొంగతనం కేసును చేదించిన ఎల్లారెడ్డిపేట పోలీసులు సుధీర్ ను కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు. పురుషుడే మహిళగా వేషం మార్చి దొంగతనానికి పాల్పడినట్లు తెలిసి ఎల్లారెడ్డిపేట ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.