ఆస్తి పంపకాల కోసం దాయాదుల అమానవీయం.. చనిపోయి రెండు రోజులైనా ఇంటిముందే మృతదేహం..
ఆస్తికోసం దాయాదులు దారుణానికి ఒడిగట్టారు. మృతేదేహానికి అంత్యక్రియలు జరపకుండా రెండు రోజులు ఇంటిముందు ఉంచారు.

మోతే : సూర్యాపేట జిల్లా, మోతే మండలంలో అత్యంత అమానవీయమైన ఘటన వెలుగు చూసింది. అనారోగ్యంతో ఓ వ్యక్తి మృతి చెందగా ఆస్తి పంపకాల నేపథ్యంలో దహన సంస్కారాలు చేయకుండా మృతదేహాన్ని రెండు రోజులపాటు ఇంటి ముందే ఉంచారు. ఆస్తుల పంపకాల రిజిస్ట్రేషన్లు అయిన తర్వాతే ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మోతే మండలంలోని సిరికొండ గ్రామంలో బుధవారం నాడు ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.
దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. మోతే మండలంలోని సిరికొండకు చెందిన వెంపటి సత్యనారాయణ (63) అనారోగ్యంతో మంగళవారం నాడు మరణించారు. సత్యనారాయణకు ఆయన భార్యకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సత్యనారాయణ సోదరుల దగ్గర ఉంటున్నారు. భార్య భాగ్యమ్మ కూడా తన సోదరుల దగ్గరే ఉంటుంది.
కొండగట్టు అంజన్న సేవలో ఎమ్మెల్సీ కవిత.. ఆలయంలో ప్రత్యేక పూజలు..
వీరిద్దరికీ సంతానం లేదు. సత్యనారాయణ ఇటీవల క్యాన్సర్ బారిన పడ్డారు. దీంతో ఆయన చికిత్స కోసం సోదరులు లక్షల్లో ఖర్చు చేశారు. అప్పు చేసి మరీ ఖర్చు చేసినట్లుగా వారు చెబుతున్నారు. మరోవైపు భాగ్యమ్మకు ఊర్లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి తల్లి గారిచ్చింది ఆమె పేరుతోనే ఉంది. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో భాగ్యమ్మ పేరుతో ఉన్న భూమిలో ఎకరం భూమిని సత్యనారాయణ పేరు మీద రిజిస్టర్ చేయాలని ఇటీవలే పెద్దలు నిర్ణయించారు.
ఈ మేరకు ధరణిలో సోమవారం స్లాట్ కూడా బుక్ చేశారు. మంగళవారం నాడు రిజిస్ట్రేషన్ ఉండడంతో సత్యనారాయణ దీనికి రావాల్సి ఉంది. కానీ మంగళవారం ఉదయమే అనారోగ్యంతో సత్యనారాయణ మృతి చెందాడు. ఈ క్రమంలోనే హైడ్రామా జరిగింది. అన్న వైద్యానికి తాము అప్పులు చేసి లక్షల్లో ఖర్చు పెట్టామని.. సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చయిందని వారు తెలిపారు.
దీని కింద తమకు వదిన పేరు మీద ఉన్న భూమిలో ఎకరంన్నర భూమి రిజిస్ట్రేషన్ చేయాలని పట్టుబట్టారు. అంతేకాదు.. అన్న దహన సంస్కారాలను అడ్డుకున్నారు. ధరణిలో స్లాట్ బుక్ చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసేదాకా అంత్యక్రియలు చేయనివ్వమంటూ తెగేసి చెప్పారు. ఇంకోవైపు భాగ్యమ్మ వదిన, మరదళ్లు, వారి పిల్లలు కూడా ఇన్ని రోజులు భాగ్యమను తాము పోషించామని.. కాబట్టి తమకు కూడా ఆ భూమిలో వాటా రావాలని పట్టు పట్టారు.
ఇరు వర్గాల ఈ వాదనల నేపథ్యంలో తహసిల్ కార్యాలయంలో ఘర్షణ నెలకొంది. దీంతో షాక్ కు గురైన భాగ్యమ్మ ఇన్నాళ్లు తనకు ఆశ్రయం ఇచ్చిన బంధువుల పిల్లలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే సత్యనారాయణ సోదరులు ధరణిలో స్లాట్ బుక్ చేసుకుని భాగ్యమ్మ పేరుతో ఉన్న భూమిలో ఎకరంన్నర భూమిని తమలో ఒకరి పేరు మీద పట్టా చేయించుకున్నారు.
భాగ్యమ్మ వదిన, మరదలు కూడా చెరో అరెకరం భూమి పట్టా చేయించుకునేందుకు ధరణిలో స్లాట్ బుక్ చేసుకున్నారు. ఆ తరువాతే గ్రామానికి వెళ్లి బుధవారం సాయంత్రానికి సత్యనారాయణకు దహన సంస్కారాలు పూర్తి చేశారు. మృతదేహాన్ని ఇంటి ముందు ఒంటరిగా వదిలేసి ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం బంధువులంతా వెళ్లిపోవడంతో.. కుమారుడి శవానికి వృద్ధురాలు అయిన తల్లి ఒంటరిగా కాపలా కాసింది. ఈ దృశ్యం చూసిన వారందరినీ కలచివేసింది.