దొంగలు రెచ్చిపోతున్నారు. కట్టుదిట్టమైన భద్రత వుండే బ్యాంక్‌కు పక్కా ప్రణాళిక ప్రకారం కన్నమేసి దాదాపు రూ.3.10 కోట్లు విలువైన సొత్తును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్‌బీఐ బ్యాంకులో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది.

మొత్తం రూ.3.10కోట్ల విలువైన సొత్తును ఎత్తుకెళ్లారు. పక్కా ప్లానింగ్‌తో బ్యాంక్ వెనుక వైపు ఉన్న కిటికీలను తొలగించి లోపలికి ప్రవేశించారు. అలారం మోగితే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైతే దొరికిపోతామని భావించి..  ముందుగానే బ్యాటరీ కనెక్షన్‌ తీసేశారు.

అనంతరం తమ వెంట తెచ్చుకున్న గ్యాస్‌ కట్టర్‌తో లాకర్‌‌ను బద్దలు కొట్టి అందులోని రూ.18.46 లక్షల నగదుతో పాటు రూ.2.92 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.

దొంగతనం దృశ్యాలు కనిపించకుండా వుండటంతో పాటు తమను గుర్తుపట్టుకుండా వుండేందుకు గాను సీసీ ఫుటేజీ డీవీఆర్‌ బాక్స్‌ను సైతం ఎత్తుకుపోయారు. గురువారం ఉదయాన్నే బ్యాంకు మేనేజర్‌, సిబ్బంది దొంగతనం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బ్యాంక్‌కు వచ్చి పరిశీలించారు. వేలిముద్రలు సైతం దొరకకుండా పక్కా ప్రొఫెషనల్స్‌లా జాగ్రత్తలు తీసుకొని దోపిడీకి పాల్పడ్డారని రామగుండం సీపీ సత్యనారాయణ చెప్పారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న ఆయన..  నిందితుల కోసం మొత్తం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.