పోలీసు అధికారి ఇంట్లోనే చోరీ జరిగింది.  సీఐ ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడటం గమనార్హం. ఈ సంఘటన సంగారెడ్డిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్ జిల్లా సీసీఎస్ సీఐ గా పనిచేస్తున్న నాగేశ్వరరావు కుటుంబం సంగారెడ్డిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో నివాసం ఉంటోంది. ఆయన తరచూ ఇంటికి వచ్చి వెళ్తుంటారు. ఇంట్లో రెండు గదులు ఉండగా ఒక గదికి తాళం వేసి మరో గదిలో కుటుంబసభ్యులు నిద్రకు ఉపక్రమించారు.

గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి గదికి వేసిన తాళాలు పగలకొట్టి 10 తులాల బంగారం, రూ.60వేల నగదును అపహరించారు. ఉదయం లేచి చోరీ విషయం గుర్తించి కుటుంబసభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ బాలాజీ, పట్టణ సీఐ, ఎస్సైలు, క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. సమీపంలోని సీసీ కెమేరాల ఫుటేజీ పరిశీలించారు. నాగేశ్వరరావు గతంలో సంగారెడ్డి పట్టణ సీఐగా చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.