మాజీ ప్రేయసితో చనువుగా ఉంటున్నాడని జూనియర్ ఆర్టిస్ట్ ను హతమార్చిన యువకుడు.. స్నేహితులతో కలిసి దారుణం
తాను ప్రేమించిన యువతితో చనువుగా ఉంటున్నాడని ఓ యువకుడు జూనియర్ ఆర్టిస్ట్ పై కోపం పెంచుకున్నాడు. తన స్నేహితులతో కలిసి అతడిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
తన మాజీ ప్రేయసితో చనువుగా ఉంటున్నాయని ఓ యువకుడు జూనియర్ ఆర్టిస్ట్ ను దారుణంగా హతమార్చాడు. దీనికి తన స్నేహితుల సాయం తీసుకున్నాడు. ఈ దారుణం హైదరాబాద్ లో గత నెలలో జరగ్గా.. నిందితుల అరెస్టుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో అధికారులు శనివారం మీడియాకు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 18 ఏళ్ల కే. కార్తిక్ హైదరాబాద్ లో ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాడు. అతడి స్వస్థలం మహబూబాబాద్ జిల్లాలోని సంసిక గ్రామం. అయితే ఆగస్టు 13వ తేదీ నుంచి అతడు కనిపించకుండా పోయాడు. దీంతో సోదరుడు శంకర్ ఆందోళన చెందుతూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. తన సోదరుడు కనిపించడం లేదంటూ గత నెల 16వ తేదీన ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల్లో రికార్డయిన దృష్యాల ఆధారంగా పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా తామే కార్తీక్ ను హతమార్చామని అంగీకరించారు.
ఏం జరిగిందంటే ?
20 ఏళ్ల టి. సాయి హైదరాబాద్ లో ఉంటూ య్యూటూబర్ గా పని చేస్తున్నాడు. అతడి స్వస్థలం విజయనగరం జిల్లా గొర్ల మండలం రాగోలు. కొంత కాలం కిందట 19 ఏళ్ల యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆమె జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తుండేది. కొంత కాలం తరువాత ఆమెను సాయి ప్రేమించాడు. కొన్నాళ్లు గడిచిన తరువాత అతడి ప్రవర్తన ఆమెకు నచ్చలేదు. దీంతో సాయిని దూరంగా ఉంచింది. కొంత కాలం తరువాత ఆమెకు కార్తీక్ పరిచయం అయ్యాడు. వారిద్దరూ చాలా దగ్గరయ్యారు.
కార్తీక్ సోదరుడు యూసుఫ్ గూడలోని ఓ గదిలో నివసించేవాడు. పోయిన నెలలో ఆ యువతితో కలిసి కార్తీక్ అతడి గదికి వెళ్లారు. మూడు రోజులు వారిద్దరూ అక్కడే గడిపారు. ఈ విషయం సాయికి తెలిసింది. అక్కడికి వెళ్లి కార్తీక్ తో వాగ్వాదానికి దిగాడు. ఆ యువతి తనకు దక్కాలంటే కార్తీక్ ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం స్నేహితుల సాయం తీసుకున్నాడు. విజయనగరంకు చెందిన 22 ఏళ్ల సురేష్, 19 ఏళ్ల రఘు, అలాగే శ్రీకాకుళంకు చెందిన 20 ఏళ్ల జగదీశ్ లతో కలిసి కార్తీక్ హత్య కోసం ప్లాన్ వేశాడు.
అందులో భాగంగా ఆగస్టు 13వ తేదీన బైక్ లపై కార్తీక్ రూమ్ కు వెళ్లారు. ఏవో విషయాలు చెప్పి అతడిన బైక్ పై తీసుకొని బోయినపల్లి ఓల్డ్ ఎయిర్ పోర్టు మార్గంలో ఉన్న అడవి ప్రాంతానికి వెళ్లారు. దారిలోని కార్తీక్ ను బైక్ పై నుంచి తోసేసి దాడికి దిగారు. తరువాత అక్కడ ఓ చెట్టుకు కట్టేసి దారుణంగా హతమార్చారు. తరువాత సురేష్ తప్ప మిగితా ముగ్గురు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. కార్తీక్ సెల్ ఫోన్ అతడి వద్దే ఉంచుకున్నాడు.
కాగా.. కార్తీక్ సోదరుడి ఫిర్యాదుతో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు యూసఫ్ గూడలో జరిగిన గొడవకు సంబంధించిన ఆధారాలు దొరికాయి. అలాగే కొన్ని రోజులు గడిచిన తరువాత సురేష్.. మృతుడి సెల్ ఫోన్ ఫోన్ ఆన్ చేశాడు. దీంతో పోలీసులు అలెర్ట్ అయి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తరువాత మిగితా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటనలో యువతి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కార్తీక్ హత్య జరిగిన ప్రాంతంలో జనసంచారం ఉండదు. దీంతో డెడ్ బాడీ పూర్తిగా కుళ్లిపోవడంతో, ఎముకలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.