ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడు కొంత కాలం తరువాత తనను పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో మరో ఫేస్ బుక్ ఫ్రెండ్ సాయంతో అతడిని హత్య చేయించింది.
ఆ గృహిణికి ఓ ఫొటోగ్రాఫర్ తో నాలుగేళ్ల కిందట ఫేస్ బుక్ పరిచయం ఏర్పడింది. రోజూ ఛాటింగ్ చేసుకునే వారు. కబుర్లు చెప్పుకునేవారు. ఈ పరిచయం కాస్తా వారి మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్ల పాటు వీరి మధ్య వ్యవహారం బాగానే సాగింది. అయితే కొంత కాలం నుంచి ఆ ఫొటోగ్రాఫర్ ఆమెను వేధించడం ప్రారంభించాడు. తనను పెళ్లి చేసుకోవాలని లేకపోతే తన వద్ద ఉన్న ఫొటోలు బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆమె మరో ఫేస్ బుక్ ఫ్రెండ్ సాయంతో అతడిని హత్య చేయించింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేట ప్రాంతంలో యశ్మకుమార్ (32) అనే వ్యక్తి ఫొటోగ్రాఫర్ గా పని చేస్తాడు. అతడికి శ్వేతా రెడ్డి (32) అనే మహిళతో 2018లో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆమె మీర్ పేట ప్రశాంతిహిల్స్ లో ఉంటుంది. వీరిద్దరి ఫేస్ బుక్ స్నేహం కొంత కాలం తరువాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో వారి మధ్య చాటింగ్ కొనసాగేది. ఓ సమయంలో ఆ ఫొటోగ్రాఫర్ ఆ మహిళకు కాల్ చేశాడు. న్యూడ్ గా వీడియో కాల్ చేయాలని కోరాడు. దానికి ఆ గృహిణి అంగీకరించింది. అతడు చెప్పినట్టుగానే న్యూడ్ గా వీడియో కాల్ చేసింది.
అంతా బాగానే సాగుతోంది అనుకుంటున్న క్రమంలో గత నెల రోజుల నుంచి అతడు ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాడు. కానీ దానికి ఆ మహిళ నిరాకరించింది. తను పెళ్లి చేసుకోకపోతే న్యూడ్ వీడియోను, ఫొటోలను బయటపెడతానని, అందరికీ షేర్ చేస్తానని యశ్మ కుమార్ బెదిరించాడు. ఈ విషయం బయటపడితే ఎక్కడ తన పరువుపోతుందో అని ఆమె భయపడింది. అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది.
దీని కోసం ఆమె అంతకు ముందే తనకు ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఉన్న ఓ యువకుడిని ఉపయోగించుకోవాలని భావించింది. ఆ యువకుడి పేరు కొంగల అశోక్. అతడు అంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా తిరువురుకు చెందిన వ్యక్తి. ఆ గృహిణి అతడికి ఫోన్ చేసి యశ్మ కుమార్ ను మర్డర్ చేయాలని చెప్పింది. దీంతో అశోక్ మే 4వ తేదీన హైదరాబాద్ కు చేరుకున్నాడు. అయితే ఆరోజు రాత్రి యశ్మకుమార్ కు శ్వేతారెడ్డి కాల్ చేసింది. తను నివాసం ఉండే ఏరియాకు పిలిపించింది. యశ్మకుమార్ ఆ ఏరియాకు వచ్చాడని నిర్ధారించుకున్న తరువాత ఈ విషయాన్ని అశోక్ కు తెలిపింది.
అర్ధరాత్రి సమయంలో అశోక్ కూడా ఆ ఏరియాకు వచ్చాడు. తనతో పాటు మరో వ్యక్తి కార్తీక్ ను అక్కడికి తీసుకొచ్చాడు. అక్కడున్న యశ్మకుమార్ ను వెనకాల నుంచి సుత్తి తీసుకొని తలపై కొట్టారు. ఇలా మూడు సార్లు కొట్టే సరికి అతడు కింద పడిపోయాడు. వెంటనే వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. బాధితుడు హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. అయితే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈ నెల 6వ తేదీన చనిపోయాడు. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. టెక్నాలజీ సాయంతో కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్టు మీర్ పేట ఇన్ స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు.
