వరినాట్లు వేసి ఇంటికి వెళ్తూ.. వరదలో కొట్టుకుపోయిన తల్లీకూతుర్లు.. భద్రాద్రి కొత్తగూడెంలో ఘటన.. వీడియో వైరల్
వరి నాట్లు వేసి ఇంటికి వెళ్తూ ఇద్దరు తల్లీ కూతుర్లు వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో చోటు చేసుకుంది. అయితే ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మరొకరి జాడ లభించలేదు.

వరి నాట్లు వేసేందుకు వెళ్లిన మహిళల బృందం తిరిగి వస్తున్న క్రమంలో ఓ లోలెవల్ వంతెన దాటాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో వరద ప్రవాహం ఉన్నప్పటికీ.. వారంతా సాహసం చేశారు. ఒకరిని పట్టుకొని మరకొరు గుంపుగా వంతెన దాటాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ బృందంలో ఉన్న ఇద్దరు తల్లీకుతుర్లు అందరూ చూస్తుండగానే వరద నీటిలో కొట్టకుపోయారు. ఇందులో కూతురు ఓ చెట్టును పట్టుకొని ప్రాణాలతో బయటపడింది. కానీ తల్లి జాడ మాత్రం ఇంకా లభించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. చాపరాల పల్లిలోని ఓ పొలంలో వరి నాట్లు వేసేందుకు కుమ్మరి పాడు గ్రామానికి చెందిన దాదాపు 20 మంది మహిళలు బుధవారం వెళ్లారు. పని ముగించుకొని వారంతా ఇంటికి బయలుదేరారు. అయితే ఈ రెండు ఆ మహిళలంతా తమ ఇంటికి చేరాలంటే మధ్యలోని పాములేరు వాగుపై ఉన్న లోలెవల్ వంతెన దాటాల్సి ఉంది.
ఆ మహిళ బృందం ఆ వంతెన వద్దకు చేరుకునే సమయానికి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే ఎంత సేపు ఎదురుచూసిన వరద ప్రవాహం తగ్గదని భావించారో ఏమో గానీ.. వారంతా అప్పుడే వంతెన దాటాలని ప్రయత్నించారు. దీని కోసం మహిళంతా గుంపుగా ఏర్పడి, ఒకరినొకరు పట్టుకొని మెళ్లగా వంతెన దాటుతున్నారు. ఈ క్రమంలో వడివడిగా అడుగులు వేసుకుంటూ మహిళలంతా మధ్య వరకు చేరుకున్నారు.
కానీ ఆ సమయంలో వరద ఉధృతిని తట్టుకోలేక కుంజా సీత, కుర్సం జ్యోతి అనే తల్లీకూతుర్లు బ్యాలెన్స్ తప్పి నీటిలో పడిపోయారు. దీంతో వెంటనే వారు ఆ వంతెనపై నుంచి నీటిలో కొట్టుకుపోయారు. మిగిలిన మహిళలు వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. అయితే అందులో జ్యోతి కొట్టుకుపోతూ ఓ చెట్టును పట్టుకొని ఆగిపోయింది. స్థానికులు వెళ్లి ఆమెను కాపాడారు. అయితే సీత మాత్రం ఇంకా కనిపించలేదు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.