ప్రస్తుతం కొనసాగుతున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కాగ్ నివేదిక ప్రవేశపెట్టింది. ఇందులో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన ఆదాయ, వ్యయాలకు సంబంధించిన పద్దులను కాగ్ నివేదించింది. 

తెలంగాణ రాష్ట్ర (telangana state) ఆర్థిక స్థితిగ‌తుల‌పై కాగ్ (CAG) విడుద‌ల చేసిన నివేదిక‌ను ప్ర‌భుత్వం అసెంబ్లీ (assembly) లో మంగ‌ళ‌వారం ప్ర‌వేశపెట్టింది. ఈ నివేదిక ప్ర‌కారం 2019- 20 ఆర్థిక సంవ‌త్స‌రంలో తీసుకున్న రుణాల్లో (loans) దాదాపు 75 శాతం పాత రుణాలు క‌ట్టేందుకు స‌రిపోయింద‌ని చెప్పింది. ఆ ఆర్థిక సంవ‌త్స‌రంలో రెవెన్యూ మిగులు ఏమీ లేద‌ని తెలిపింది. ద్ర‌వ్య లోటును భ‌ర్తీ చేసేందుకు 97 శాతం మార్కెట్ లోన్ల‌ను (market loans) ఉప‌యోగించుకుంద‌ని కాగ్ స్ప‌ష్టం చేసింది. అయితే ఎఫ్ఆర్ బీఎం నిబంధ‌న‌లకు అనుగుణంగానే లోన్లు ఉన్నాయ‌ని కాగ్ చెప్పింది. 

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఎడ్యుకేష‌న్ (education), హెల్త్ (health) సెక్టార్ లపై చాలా త‌క్కువ‌గా ఖ‌ర్చు పెట్టింద‌ని కాగ్ తెలిపింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆస్తుల సృష్టిపై ప్ర‌భుత్వం పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేద‌ని చెప్పింది. ఇదే ఆర్థిక సంవ‌త్స‌రంలో రెవెన్యూ రాబ‌డి రూ.1124 కోట్లు పెరిగాయ‌ని కాగ్ తెలిపింది. అయితే క్యాపిటల్ వ్యయం చాలా త‌గ్గిపోయింద‌ని తెలిపింది. 

తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులు స‌రైన స‌మ‌యంలో పూర్తి కాక‌పోవ‌డంతో క్యాపిట‌ల్ నిధులు ప‌డిపోయాయ‌ని కాగ్ పేర్కొంది. ఉద‌య్ (UDAY) ప‌థ‌కం కింద విద్యుత్ డిస్కంలు తీసుకున్న లోన్లు క‌ట్ట‌లేద‌ని చెప్పింది. తెలంగాణ బడ్జెట్ (telangana budget) అమలు నియంత్రణ స‌రైన విధంగా చేయ‌డం లేద‌ని పేర్కొంది. అసెంబ్లీ ఆమోదించిన దానికంటే ఎక్కువ‌గానే వ్యయం చేస్తుంద‌ని కాగ్ చెప్పింది. గ‌డిచిన ఐదు సంవ‌త్స‌రాల్లో రూ.84, 650 కోట్లు ఎక్కువ‌గా ఖ‌ర్చు చేసింద‌ని కాగ్ (CAG) స్ప‌ష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రం 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో రెవెన్యూ మిగులుగా ఉంద‌ని , అయితే ఆ త‌రువాత నుంచి రెవెన్యూ లోటులోకి వెళ్లిపోయింద‌ని చెప్పింది.