హైదరాబాద్: తాను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి రాజీనామా చేస్తూ చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి మూడు పేజీల లేఖ రాశారు. ఈ మూడు పేజీల్లో తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలు నడిచిన తీరును, టీఆర్ఎస్ సిద్ధాంతాలను, కేసిఆర్ సాధించదలిచిన ఆశయాలను రెండు పేజీల్లో వివరించారు. తాను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చి చేవెళ్ల నుంచి పోటీ చేసిందీ వివరించారు. 

చివరి పేజీలో తాను రాజీనామా చేయడానికి గల ఐదు కారణాలను తెలియజేశారు. ఆ ఐదు కారణాలపై అందులో సంక్షిప్తంగా వివరించారు. ఆ ఐదు కారణాలు, అందుకు చెప్పిన వివరణను ఆయన మాటల్లోనే చదవండి.

నేనెందుకు పార్టీ వీడవల్సిన పరిస్థితి ఏర్పడిందో మీరు తెలుసుకోవాలని అనుకుంటే నేను మీతో ఈ 5 రకాల కారణాలను పంచుకోగలను. 

1. వ్యక్తిగత స్థాయిలో 
2. తెలంగాణ కోసం పోరాడిన కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం కారణంగా 
3. నియోజకవర్గం కోసం  
4. రాష్ట్ర స్థాయిలో
5. పార్టీ స్థాయిలో

వ్యక్తిగత స్థాయిలో నేను పార్టీకి అవసరమైనపుడు 2014 లో పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేశాను. కానీ తరువాత పార్టీలోకి ఉద్యమానికి, మన పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా పని చేసిన వారిని చేర్చుకోవడం నాలాంటితెలంగాణ వాదుల అవసరం పార్టీకి లేదనిపించింది. 

మన పార్టీ నియమావళి అసుసరించిఒక నిబద్దత కలిగిన కార్యకర్తగా ఎన్నిసార్లు రెచ్చగొట్టినా ఏమీ మాట్లాడలేదు. పైపెచ్చు నేను చాలా విషయాలను సద్దుమణిగేలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 

ఈ పరిస్థితుల్లో నేను పార్టీలో కొనసాగడం కష్టంగా మారింది. దీంతో పార్టీ వీడటమే మార్గంగా తోచింది. నా లోక్ సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా.

తెలంగాణ ఉద్యమ నాయకుడిగా మీ మీద(కేసీఆర్) నాతో పాటు యావత్ తెలంగాణ ప్రజానికానికి మీరంటే అపారమైన గౌరవం. తెలంగాణ చరిత్న పుట్టల్లో మీ స్థానం ప్రత్యేకమైనది. 

నేను ఓ ఫక్తు రాజకీయ నాయకుణ్ణి కానందున సిద్దాంతాన్ని,, సెంటిమెంట్ ను పక్కన పెట్టలేకపోతున్నాను.  గత్యంతరం లేక పార్టీని వీడుతున్నాను. కానీ మీతో సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నాను.

విశ్వేశ్వర రెడ్డి...