పోల్ నుంచి తెగి కంచెపై పడ్డ కరెంట్ తీగ.. పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా షాక్ తగిలి కౌలు రైతు మృతి..
కరెంట్ పోల్ నుంచి ఓ తీగ తెగి పొలానికి రక్షణగా వేసిన కంచెపై పడింది. అయితే పొలం చూసేందుకు వచ్చిన రైతు కంచె పట్టుకొని దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఆయనకు కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఆ రైతు అక్కడికక్కడే చనిపోయాడు.
ఓ కౌలు రైతు కరెంట్ షాక్ తో మరణించిన ఘటన మెదక్ జిల్లాలో శివ్వంపేటలో చోటు చేసుకుంది. ఇది స్థానికంగా విషాదాన్ని నింపింది. పెద్దగొట్టిముక్ల గ్రామానికి చెందిన 35 ఏళ్ల కుమ్మరి పెంటయ్య వ్యవసాయం చేస్తుంటాడు. ఓ పొలం కౌలుకు తీసుకొని అందులో వరి పండిస్తున్నాడు. అయితే ఆదివారం వరి పొలం చూసి వద్దామని ఇంటి నుంచి బయలుదేరాడు.
ఆ పొలం చుట్టూ ఇనుప కంచె ఉంది. దగ్గరలో ఉన్న కరెంట్ పోల్ పై నుంచి ఓ తీగ తెగి ఆ కంచెపై పడింది. దీనిని పెంటయ్య గమనించలేదు. ఎప్పటిలాగే కంచెలో నుంచి దూరి పొలంలోకి వెళ్లాలని అనుకున్నాడు. అయితే కంచె పట్టుకున్న వెంటనే అతడికి కరెంట్ షాక్ తగిలింది. ఆ షాక్ భారీ స్థాయిలో ఉండటంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.
ఈ విషయం తెలియడంతో భార్య నాగమణి అక్కడికి చేరుకుంది. భర్త పరిస్థితి చూసి తీవ్రంగా రోదించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై రవికాంత్‌రావు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 18వ తేదీన ఏపీలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కరెంట్ షాక్ తో ఓ రైతులు ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా శింగనమల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నార్పాల అనే గ్రామంలో 40 ఏళ్ల బాలకృష్ణ తన భార్యా, పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. ఆయన భార్య భాగ్యలక్షి నార్పల-4 ఎంపీటీసీ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు.
అయితే ఈ కుటుంబం గ్రామ సమీపంలో ఉన్న వారి వ్యవసాయ భూమిలో పలు రకాల పంటలు సాగు చేస్తూ జీవిస్తోంది. ఈ క్రమంలో ఎప్పటిలాగే బాలకృష్ణ మంగళవారం కుడా తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అక్కడ మొక్కజొన్న పంటకు పురుగు మందులు స్ప్రే చేయాలని భావించారు. ఆయన వెంట భార్య, పిల్లలు కూడా చేన్లోకి వచ్చారు. అయితే నీళ్ల కోసం బోర్ మోటర్ స్విచ్ ఆన్ చేయాలని ఆయన భార్యకు సూచించారు.
దీంతో ఆమె తన పిల్లలతో కలిసి స్టార్టర్ బాక్స్ వద్దకు వెళ్లింది. అనంతరం బటన్ వేయాలని ప్రయత్నించగా ఒక్క సారిగా ఆమెకు కరెంట్ షాక్ వచ్చింది. ఆమెతో పాటు పిల్లలు కూడా కరెంట్ షాక్ కు గురయ్యారు. దీనిని గమనించిన భర్త అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన లుంగీతో ముగ్గురినీ పక్కకు లాగి, కాపాడారు. భార్యా పిల్లలను కాపాడే క్రమంలో ఆయన బ్యాలెన్స్ తప్పి స్టార్టర్ బాక్స్ పై పడిపోయాడు. దీంతో ఆయనకూ కరెంట్ షాక్ వచ్చింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడే చనిపోయారు.