తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌లపై ఉన్న కేసులను న్యాయశాఖ ఎత్తివేసింది. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో ఉద్యమకారులుగా ఉన్న కేసీఆర్, హరీశ్‌రావు, కోదండరామ్‌ సహా పలువురు నేతలపై రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తున్నట్లు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

వీరిపై వికారాబాద్, నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై వివరణ ఇవ్వాలని పోలీస్ శాఖను కోరిన న్యాయశాఖ.. నివేదిక ఆధారంగా కేసులను ఎత్తివేసింది. మరోవైపు మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి తదితరులపై నమోదైన కేసులను కూడా ప్రభుత్వం తొలగించింది.

ఉద్యమ సమయంలో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగించారని.. ప్రభుత్వ అధికారుల విధులను అడ్డుకున్నారన్న ఆరోపణలపై వీరిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తన ఇష్టదైవం కోయినాపల్లి వెంకన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.