జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలోని  జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో 23 ఏళ్ల యువతిపై ప్రేమోన్మాది కత్తిదాడి చేసి తాను గొంతు కోసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రమోన్మాది మృతి చెందాడు.

యువతిపై దాడి చేసిన తర్వాత గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఆ యువకుడు. ఆ ఘటన శనివారంనాడు జరిగింది. జాబితాపూర్ కు చెందిన యువతి, అదే గ్రామానికి చెందిన కట్కం రాజ్ కుమార్ మిత్రులు. ఇద్దరు పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. 

ఇంటర్మీడియట్ చేసిన తర్వాత రాజ్ కుమార్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. యువతి ఇక్కడే ఉంటూ పీజీ చేస్తోంది. వారిద్దరూ తరుచుగా ఫోన్ లో మాట్లాడుకునేవారు. ఇరవై రోజుల క్రితం రాజ్ కుమార్ దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. యువతిని కలిసేందుకు విఫలయత్నం చేశాడు. ఫోన్ చేసినా యువతి సరిగా స్పందించలేదు. దాంతో అతను ఆమెపై కోపం పెంచుకున్నాడు.

రాజ్ కుమార్ శనివారం మధ్యాహ్నం యువతి ఇంట్లోకి వెళ్లి కత్తితో ఆమెపై దాడి చేశాడు. మెడ, వీపులపై దాడి చేశాడు. యువతి తప్పించుకుని కేకలు వేయడంతో ఇరుగు పొరుగువారు అక్కడికి చేరుకున్నాడు. ఈలోగా అతను తన గొంతు కోసుకున్నాడు. 

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని ఆస్పత్రికి తరలించారు. రాజ్ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాుడ. యువతి జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.