ఖమ్మం జిల్లా  వైరా టీఆర్ఎస్ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోనీయా గాంధీకి తెలంగాణ ప్రజలు కృతజ్ఞతలు చెప్పాల్సిందేనని అన్నారు.  

ఖమ్మం: అమ్మ సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారు... ఆమెకు కృతజ్ఞతలు చెప్పాలి అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలోని బొక్కలతండాలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక సీఎం కేసీఆర్ ను కూడా రాములు నాయక్ కొనియాడారు. ప్రజల సాదకబాధకాల్లో తోడుగా వుంటానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి చెక్కులు పంపించారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఆడబిడ్డ పెళ్లికి రూ.1,16,000 అందిస్తున్నారని తెలిపారు. కాబట్టే అన్ని పార్టీలు కూడా కేసీఆర్ ను ఆశీర్వదిస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. 

read more Huzurabad Bypoll:కేసీఆర్ కాదు ఆయన జేజమ్మ కూడా ఏం చేయలేదు: ఈటల సంచలనం

''అందరి ఆశిస్సులతో వరుసగా రెండుసార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు... ముచ్చటగా మూడోసారి కూడా ఆయనే సీఎం అవుతారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మీ కోసం ఇంత చేస్తున్న ఆయన గురించి కూడా మీరు ఆలోచించాలిగా. భావజాలం ఎలాంటిది అయినా అభివృద్ధికి సపోర్ట్‌ చేయాల్సిందే'' అని అన్నారు. 

''నక్సల్స్ కూడా దేశభక్తులేనని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అన్నారు. ఆయనకు కూడా నమస్కారం చేయాలి. ఇలాంటి భావజాలమే ప్రతి ఒక్కరూ కలిగివుండాలి'' అంటూ వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.