హైదరాబాద్‌: కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లో దళారులు రెచ్చిపోయారు. తాము చెప్పినట్లు వినకపోవడంతో రైతులపై విచక్షణంగా దాడికి దిగారు. వివరాల్లోకి వెళ్తే కొత్తపేట ఫ్రూట్స్ మార్కెట్ లో బొప్పాయి రైతులు బొప్పాయిలను నేరుగా మార్కెట్ కు తరలించారు.    

తమను సంప్రదించకుండా నేరుగా మార్కెట్ కు బొప్పాయి తరలించడంతో దళారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొప్పాయి రైతులపై దాడికి పాల్పడ్డారు. దళారుల దాడికి దిగడంతో రైతులు సైతం వారిపై ఎదురు దాడికి దిగారు.  

ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బొప్పాయి పండ్లు తమకే అమ్మాలని దళారులు డిమాండ్ చేశారు. అయితే దళారులు నిర్ణయించిన ధర తమకు గిట్టుబాటు కాదని రైతులు స్పష్టం చేస్తున్నారు. 

హైదరాబాద్ నగరంలో డెంగ్యూ ఫీవర్ తో సిటీలో బొప్పాయి విక్రయాలు పెరిగాయని కిలో బొప్పాయి రూ.100 పలుకుతుందని తెలిపారు. అయితే దళారులు మాత్రం చాలా తక్కువకు అడగడంతో తాము అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని రైతులు చెప్తున్నారు.