వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత.. బస్సుపై కిరోసిన్ పోసి కాల్చే యత్నం..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ శ్రేణులు షర్మిల పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నించారు

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రస్తుతం వైఎస్ షర్మిల పాదయాత్ర వరంగల్ జిల్లా నర్సంపేటలో కొనసాగుతుంది. అయితే అక్కడ కొందరు టీఆర్ఎస్ శ్రేణులు షర్మిల పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నించారు. లింగగిరి గ్రామంలో షర్మిల పాదయాత్రలో వినియోగిస్తున్న బస్సుపై దాడి చేశారు. బస్సుపై కిరోసిన్ పోసి కాల్చే ప్రయత్నం చేశారు. అయితే మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. షర్మిల గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను నైట్ హాల్ట్‌కు వినియోగించే బస్సును టీఆర్ఎస్ గుండాలు తగలబెట్టారని అన్నారు. తమ వాళ్లపై దాడులు కూడా చేశారని ఆరోపించారు. విజయవంతంగా సాగుతున్న పాదయాత్రను ఆపేందుకు కేసీఆర్ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించి.. తనను అరెస్ట్ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. పాదయాత్రకు అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు.