హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు, రైతుల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది.  మార్కెట్‌ గేటు బయట వద్ద రైతుల బైఠాయించడంతో వాహనాలు  బయటకు రాలేదు. దీంతో పోలీసులు రైతులను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మార్కెట్ కమిటీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ప్రతి రోజూ బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్ కు రైతులు కూరగాయల బస్తాలను తీసుకొస్తారు. ఈ బస్తాలు సుమారు 80 కిలోలు ఉంటాయి. అయితే ఈ బస్తాలను  మోసేందుకు హమాలీలు అంగీకరించలేదు. 50 కిలోల బస్తాలైతే తమకు సులభంగా ఉంటుందని  రైతులతో హమాలీలు చెప్పారు. ఈ విషయమై రైతులు, వ్యాపారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.

మార్కెట్‌లో ఎలాంటి లావాదేవీలు చోటు చేసుకోలేదు. మార్కెట్‌లోకి వచ్చిన వాహనాలను బయటకు వెళ్లకుండా రైతులు గేటు బయట బైఠాయించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ విషయం తెలిసిన పోలీసులు బోయి‌న్ పల్లి మార్కెట్ వద్దకు చేరుకొన్నారు.

మార్కెట్ వద్ద  అప్పటికే రైతులు  ఆందోళన చేస్తున్నారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ తమ పంటలను తూకం వేయాలని రైతులు డిమాండ్ చేశారు. అయితే 50 కిలోల బస్తాలు ఉండాలని  రైతులకు వ్యాపారులు తెగేసి చెప్పారు. రెడు వర్గాలు తమ వాదనకే కట్టుబడి ఉన్నారు.

ఈ విషయమై ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రైతులు, వ్యాపారుల మధ్య చోటు చేసుకొన్న వివాదాన్ని పరిష్కరించకపోతే  పరిష్కరించకపోతే  పరిస్థితి మరింత జఠిలమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.