మెగా డీఎస్‌సీ కోరుతూ టీఆర్‌టీ అభ్యర్థుల ఆందోళన: హైద్రాబాద్ లో ఉద్రిక్తత
మెగా డీఎస్‌సీని నిర్వహించాలని కోరుతూ హైద్రాబాద్ లో టీఆర్‌టీ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు.ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
హైదరాబాద్: పాఠశాల విద్యా శాఖ కార్యాలయం వద్ద మంగళవారంనాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెగా డీఎస్‌సీని ప్రకటించాలని టీఆర్‌టీ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. ఎంపీ ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు.పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం నుండి అసెంబ్లీ వైపు అభ్యర్థులు పరుగులు తీశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేశారు. ఈ సమయంలో అసెంబ్లీ వైపు కొందరు ఆందోళనకారులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తెలంగాణ రాష్ట్రంలో డీఎస్‌సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.మూడు రోజుల క్రితం తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. డీఎస్ సీ ద్వారా 2,575 ఎస్‌జీటీ, 1739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎస్‌సీ ద్వారానే ఉపాధ్యాయ నియామకాల పోస్టులను భర్తీ చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
అయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఐదువేల పోస్టుల భర్తీతో ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయపోస్టులను భర్తీ చేయాలని ఇవాళ టీఆర్‌టీ అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది.