ఖమ్మం: తెలుగు రాష్ట్రాల్లో తహాశీల్దార్ కార్యాలయాల వద్ద రైతుల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో తహాశీల్దార్ లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

తాజాగా  కొణిజర్ల తహాశీల్దార్ కార్యాలయం వద్ద రైతులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళనకు దిగారు. పాస్ పుస్తకాల ఇవ్వాలని రోజుల తరబడి తహాశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తుమ్మలపల్లి రైతులు ఆందోళనకు దిగారు. 

మండల తహాశీల్ధార్ కార్యాలయం గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. అంతేకాదు తమ వెంట తెచ్చుకున్న పురుగులమందు డబ్బాలతో నిరసన తెలిపారు. తమకు పాస్ పుస్తకాలు ఇస్తారా లేకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోమంటారా అంటూ ఆందోళనకు దిగారు. 

అంతేకాదు తహాశీల్ధార్ కార్యాలయం వద్ద రైతులు పురుగుల మందుల డబ్బాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారన్న విషయం తెలుసుకోవడంతో ఇతర రైతులు సైతం తహాశీల్ధార్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  

ఇటీవలే రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్ మెట్ తహాశీల్ధార్ విజయారెడ్డిని సురేష్ అనే రైతు పెట్రోల్ పోసి తగులబెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తహాశీల్దార్ విజయారెడ్డితోపాటు రైతు సురేష్, వాచ్ మన్ లతోపాటు మెుత్తం నలుగురు మృతి చెందారు. 

తహాశీల్ధార్ విజయారెడ్డి హత్యపై తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పై హత్యాయత్నం జరగడంతో మిగిలిన తహాశీల్ధార్ లు సైతం బిక్కుబిక్కుమంటూ గడిపారు. 

కొందరు తహాశీల్ధార్ లు అయితే తనను కలవకుండా ఉండేందుకు తాళ్లు కడితే మరొక తహాశీల్ధార్ కౌంటర్ ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొక తహాశీల్ధార్ అయితే తాను లంచం తీసుకోను అంటూ ప్రత్యేకంగా బోర్డులు పెట్టిన సంగతి తెలిసిందే.