తెలంగాణలో వేసవి ఆరంభంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. భానుడి భగభగలకు పలు జిల్లాల్లో  జనాలు మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. 

తెలంగాణలో వేసవి ఆరంభంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటేశాయి. భానుడి భగభగలకు పలు జిల్లాల్లో జనాలు మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. సూర్యతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావారణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వాతావారణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వేడిగాలుల తీవ్రత కొనసాగుతుంతడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలుచోట్ల వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పరిస్థితులు ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎంతలా ఉంటుందో అని వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో ముఖ్యమైన పనుల నిమిత్తం మాత్రమే బయటకు రావడానికి ఇష్టపడుతున్నారు. వేడిగాలుల తీవ్రత పెరగడంతో.. కొబ్బరి బొండాలు, చెరకు, మజ్జిగ, ఇతర శీతల పానీయాలు, పుచ్చకాయల విక్రయాలు పెరిగాయి.

ఇక, ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ మంగళవారం తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం పగలు కొన్నిచోట్ల స్వల్పంగా వర్షాలు కురిశాయి. ఇతర ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో మంగళవారం అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో 41.9, ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్‌లో అత్యల్పంగా 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.