తెలంగాణలో భానుడి ధాటికి జనం అల్లాడుతున్నారు. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయి. సోమవారం ఒక్క రోజే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మంగళవారం వడగాలులు వీచే అవకాశం ఉందని.. మరికొన్ని రోజులు ఇదే రకమైన వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే గానీ బయటకు రావొద్దని ప్రజలను హెచ్చరించారు.

వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు ఏపీలోని చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కోస్తా, తమిళనాడు పరిసరాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని.. దీని ప్రభావంతో బుధవారం తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడి వర్షం కురుసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.