సారాంశం

జార్ఖండ్‌లో కలెక్టర్ గా పని చేస్తున్న తెలంగాణకు చెందిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. బదిలీపై వేరే జిల్లాకు వెళ్తున్న క్రమంలో తనకు సేవలు అందించిన బంట్రోతులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఓ బంట్రోతు కాళ్లు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

ఆయన ఓ ఐఏఎస్ ఆఫీసర్. తెలంగాణలోని జమ్మికుంట ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతర రాష్ట్రంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అయితేనేమీ ఆయన ఎక్కడా తన అధికార దర్పాన్ని ప్రదర్శించలేదు. కింది స్థాయి ఉద్యోగులను కూడా ఆప్యాయంగా పలకరిస్తారు. వారికి గౌరవమిస్తారు. ఆయనే ఐఏఎస్ ఆఫీసర్ దొడ్డే ఆంజనేయులు. తాజాగా ఆయన ఏ కలెక్టరూ చేయని పని చేసి వార్తల్లో నిలిచారు. 

2010 బ్యాచ్‌ ఐఏఎస్‌ టాపర్లలో ఒకరిగా నిలిచిన దొడ్డె అంజనేయులు జార్ఖండ్‌లోని పలామూ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఆయనను దుమ్కా జిల్లాకు బదిలీ చేసింది. అక్కడికి వెళ్లే ముందు పలామూ జిల్లాలో పని సమయంలో తనకు సహాయంగా నిలిచి, సేవలు అందించిన ముగ్గురు బంట్రోతులను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా నందలాల్ అనే బంట్రోతును సన్మానిస్తూ ఆయన ఎమోషనల్ అయ్యారు. బంట్రోతు కాళ్లు మొక్కారు. తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. నందలాల్ నుంచి ఆశీర్వాదం కోరారు. ఇది చూసిన అక్కడి అధికారులు, ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి వాచ్ మన్ గా పని చేశారని చెప్పారు. నందలాల్ ను చూస్తే తన తండ్రి గుర్తొచ్చారని భావోద్వేగం అయ్యారు. బంట్రోతు సేవలను కొనియాడారు. ఈ విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ దొడ్డే ఆంజనేయులును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.