అమరావతి: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పుంజుకునేలా చేస్తానని మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండటం చారిత్రక అవసరమని చెప్పుకొచ్చారు. 

ఖమ్మం జిల్లా కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమావేశమైన చంద్రబాబు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తానని కార్యకర్తలకు స్పష్టం చేశారు. తెలుగు వాళ్లు ఎక్కడున్నా బాగుండాలని కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొచ్చారు.  

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తాను పట్టించుకోవడం లేదంటూ వస్తున్న విమర్శలు సరికాదన్నారు చంద్రబాబు. గతంలో దూరదృష్టితో ఆలోచించి పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. తన నిర్ణయాలతోనే తన మానస పుత్రిక అయిన హైద్రాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని చంద్రబాబు స్పష్టం చేశారు.  

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఓటమిపాలైనంత మాత్రాన తాను కృంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. తాను ఆశావాదినని ఎప్పుడూ అధైర్యపడే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.  తెలంగాణలో నాయకులు వెళ్లారు కానీ కార్యకర్తలెవరూ పార్టీని వీడలేదని చెప్పుకొచ్చారు.  

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకునేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కార్యకర్తల నుంచే మళ్లీ నాయకులను తయారు చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. 

తెలుగు ప్రజలకు శాశ్వత ఆస్తి ఉండాలని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పుకొచ్చారు. అయితే ఒక్క అవకాశం అంటూ అమరావతి మనుగడనే ప్రశ్నార్థకం చేశారంటూ సీఎం జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.