Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో తొలుత ఖమ్మంపై గురిపెట్టిన టీడీపీ.. చంద్రబాబు బహిరంగ సభకు ముహుర్తం ఫిక్స్..

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మంలో టీడీపీ నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.
 

telugu desam party first focus on khammam Chandrababu to address meeting on Dec 21
Author
First Published Nov 27, 2022, 11:00 AM IST

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. ఇటీవల టీటీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు.. తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ మాజీ నేతలంతా మళ్లీ పార్టీలో చేరాలని కోరారు. టీడీపీ నుంచి వెళ్లి ఎక్కడ పనిచేస్తున్నా ఆత్మగౌరవంతో మళ్లీ పార్టీలో చేరాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకోస్తామని చెప్పారు. 

ఇక, టీటీడీపీ పగ్గాలు చేపట్టిన కాసాని జ్ఞానేశ్వర్.. రాష్ట్రంలోని పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందని.. యువతకు టికెట్లు ఇస్తామని చెబుతున్నారు. అయితే తొలుత తెలంగాణలో టీడీపీ టార్గెట్ ఖమ్మం జిల్లా అనేది స్పష్టం అవుతుంది. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌పై టీడీపీ ఫోకస్ చేసే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీపై ఆంధ్ర పార్టీ అనే విమర్శలు వినిపించేవి. 

అయితే 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా టీడీపీ ఇక్కడ.. 15 స్థానాల్లో విజయం సాధించింది. అందులో ఎక్కువ భాగం గ్రేటర్ హైదరాబాద్ పరిధి, దాని చుట్టుపక్కల నియోజకవర్గాలదే. ఆ తర్వాత టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడటంతో.. తెలంగాణలో ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గ్రేటర్ పరిధిలో కూడా పార్టీ పరిస్థితి దిగజారింది. 

అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్‌తో కలిసి కూటమిగా బరిలో నిలిచిన టీడీపీకి ఘోర పరాభవమే ఎదురైంది. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలోని రెండు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఆ తర్వాత ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అధికార టీఆర్ఎస్‌లో చేరిపోయారు. సుదీర్ఘకాలం టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ కూడా.. పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో టీడీపీకి మరింతగా గడ్డు పరిస్థితి ఎదురైంది. 

అయితే ఇటీవల కాలంలో తెలంగాణ పార్టీ పరిస్థితిపై దృష్టి సారించిన చంద్రబాబు.. ఎల్ రమణ తర్వాత టీటీడీపీ అధ్యక్షుడిగా కొనసాగిన బక్కని నర్సింహులు స్థానంలో కాసాని జ్ఞానేశ్వ‌ర్‌ను నియమించారు. బక్కని నర్సింహులును టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. కాసాని జ్ఞానేశ్వ‌ర్‌‌కు బలమైన బీసీ నేతగా పేరు ఉంది. గతంలో తెలంగాణలో టీడీపీకి ఎక్కువగా బీసీల మద్దతు ఉండేది. ఈ ఫార్ములాతోనే తెలంగాణ అధిక ఓట్ల శాతం ఉన్న బీసీలను టార్గెట్  చేస్తూ కాసాని జ్ఞానేశ్వ‌ర్‌ను టీటీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించారని తెలుస్తోంది. 

అయితే కాసాని జ్ఞానేశ్వ‌ర్‌ కూడా టీటీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాక్టివ్‌గా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీకి అంతో ఇంతో పట్టు ఉన్న ఖమ్మం జిల్లాపై తొలుత దృష్టి సారించాలని నిర్ణయించారు. శనివారం ఎన్టీఆర్ భవన్‌లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నేతలతో కాసాని జ్ఞానేశ్వ‌ర్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 21న ఖమ్మంలో జరిగే టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారని చెప్పారు. అలాగే రాష్ట్రంలో బస్సు యాత్ చేపట్టాలనే యోచనలో కూడా ఉన్నట్టుగా తెలిపారు. 

ఖమ్మం జిల్లాలో పార్టీకి బలమైన క్యాడర్ ఉందని..  అక్కడి నుంచి పార్టీని పునరుద్దరించాలని చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారని చెప్పారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పారు. ఖమ్మం సభ తర్వాత తెలంగాణలో టీడీపీ పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని జ్ఞానేశ్వర్‌ వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే.. ఇటీవల గోదావరికి వరదలు వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు భద్రాచలంలో పర్యటించిన సంగతి  తెలిసిందే. భద్రాచలంలో కరకట్టను చంద్రబాబు పరిశీలించారు. వరద పరిస్థితిపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ హయాంలోనే అక్కడ కరకట్ట నిర్మించామని గుర్తుచేశారు. ఇక, ఈ పరిణామాలను గమనిస్తున్న తెలంగాణలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా.. టీడీపీ బలోపేతంపై చంద్రబాబు దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios