Asianet News TeluguAsianet News Telugu

తెలుగు అకాడమీ స్కామ్: మర్కంటైల్ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రాజు అరెస్ట్

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాదు సీసీఎస్ పోలీసులు ఏపీ మర్కంటైల్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ను అరెస్టు చేశారు.

Telugu Akademi scam: Marcantile bank Satyanarayana raju arrested
Author
Hyderabad, First Published Oct 1, 2021, 6:14 PM IST

హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో హైదరాబాదు నగర క్రైమ్ బ్రాంచ్ (సీసీఎస్) పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. ఏపీ మర్కంటైల్ కో ఆపరేటివ్ సొసైటి బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రాజును పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్ల బదలాయింపులో సత్యనారాయణ రాజు కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇదిలావుంటే, తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో హైదరాబాదు సీసీఎస్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. ఏపీ మర్కంటైల్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఉద్యోగి మొహినుద్దీన్ ను అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు సీసీఎస్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. తెలుగు అకాడమీకి చెందిన డబ్బులను ఆ బ్యాంకుకు బదిలీ చేసినట్లు, అక్కడి నుంచి ఒకరి ఖాతాలోకి డబ్బులు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అరెస్టు చేశారు. 

కాగా, ఏడాది పాటు తెలుగు అకాడమీ చేసిన ఫిక్స్ డ్ డిపాజిట్ డబ్బులను తీసుకుని వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుదామని అనుకున్నానని, ఆ తర్వాత ఆ మొత్తాన్ని గడువులోపల ఫిక్స్ డ్ డిపాజిట్ లో చేరుద్దామని అనుకున్నానని ఇప్పటికే అరెస్టేయిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ పోలీసు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. 

ఇదిలావుంటే, తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో హైదరాబాదు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తెలుగు అకాడమీలో 70 కోట్ల రూపాయల మేర గోల్ మాల్ జరిగినట్లు గుర్తించారు. దీనిపై తెలుగు అకాడమీ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగి ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేశారు. 

యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీని, అగ్రసేన్ బ్యాంక్ మేనేజర్ పద్మావతిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. యూనియన్ బ్యాంక్ నుంచి సహకార బ్యాంకుల పేరు నడుస్తున్న మూడు బ్యాంకులకు తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్ డ్ డిపాజిట్ నిధులు బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ మూడు బ్యాంకుల నుంచి వ్యక్తుల ఖాతాల్లోకి డబ్బులు బదిలీ అయ్యాయని చెబుతున్నారు. ఆ మూడు బ్యాంకుల్లో అగ్రసేన్ బ్యాంక్ ఒకటి.

విజయవాడ మార్కంటైల్ బ్యాంకుకు తెలుగు అకాడమీ నిధులు బదిలీ అయినట్లు తెలుస్తోంది. దాన్ని సహకార బ్యాంకుగా చెబుతున్నప్పటికీ అందుకు సంబంధించిన నియమనిబంధనలను అది పాటించడం లేదని సమాచారం. అలాంటి బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఓ వ్యక్తి సహకార బ్యాంకు పేరు మీద దాన్ని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 

తెలుగు అకాడమీకి చెందిన దాదాపు 70 కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగినట్లు గుర్తించారు. ఇందులో ప్రధాన సూత్రధారిని, నిందితులను పోలీసులు గుర్తించారని అంటున్నారు. మస్తాన్ వలీ కేంద్రంగా ఈ అక్రమాలు జరిగినట్లు భావిస్తున్నారు. 

కాగా, తెలుగు అకాడమీ దాదాపు 34 బ్యాంకుల్లో నిధులను ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అకాడమీ అధికారులు రెండు లేదా మూడు నమ్మకమైన బ్యాంకులను ఎంపిక చేసుకుని ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయకుండా అన్ని బ్యాంకుల్లో ఎందుకు చేశారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆ బ్యాంకుల్లో తమ నిధులు భద్రంగా ఉన్నాయా, లేవా అని గుర్తించే పనిలో తెలుగు అకాడమీ అధికారులు పడ్డారు. 

ఆ బ్యాంకులను గుర్తించి, వాటిలో డబ్బులు భద్రంగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి దాదాపు 20 మంది ఉద్యోగులను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. వాళ్లంతా బ్యాంకులను గుర్తించలేక సతమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ బ్యాంకులు ఎక్కడెక్కడో ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఆ డిపాడిట్లు అలా ఎందుకు చేశారు, ఎవరి ప్రోద్బలంతో చేశారనే విషయాలను కనిపెట్టే పని కూడా మరో వైపు జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios