Asianet News TeluguAsianet News Telugu

డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ పేరుతో మోసం: హైద్రాబాద్‌లో టీవీ ఛానెల్ ఛైర్మెన్ అరెస్ట్

డబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్  ఇప్పిస్తానని 40 మంది నుండి రూ. 70 లక్షలు వసూలు చేసిన నిందితుడిని సైబరాబాద్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.  విజన్ టీవీ ఛానెల్ ఛైర్మెన్ గతుల ప్రశాంత్ ఈ మోసంలో కీలక నిందితుడిగా ఉన్నారు. 

Television channel head held for 2BHK fraud in Hyderabad
Author
Hyderabad, First Published Jul 28, 2020, 10:50 AM IST


హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్  ఇప్పిస్తానని 40 మంది నుండి రూ. 70 లక్షలు వసూలు చేసిన నిందితుడిని సైబరాబాద్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.  విజన్ టీవీ ఛానెల్ ఛైర్మెన్ గతుల ప్రశాంత్ ఈ మోసంలో కీలక నిందితుడిగా ఉన్నారు. 

సోమవారం నాడు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నిందితుడిని మీడియాకు చూపారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన మీడియాకు వివరించారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం నడిమిలంక గ్రామానికి చెందిన నిందితుడు ప్రశాంత్ డబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడని సీపీ చెప్పారు.

 నిజాంపేట, కైతలాపూర్‌ గ్రామాల్లో మీడియా వ్యక్తులకు డబుల్‌ బెడ్రూం ఫ్లాట్లు కేటాయిస్తోదంటూ కొంతమంది అమాయకులతో ప్రశాంత్‌ పరిచయం పెంచుకున్నాడు. దాదాపు 40 మంది నుంచి ఆధార్‌ కార్డులు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ప్రస్తుత చిరునామా కరెంట్‌ బిల్లు తీసుకున్నాడు. 

అనంతరం ఒక్కో వ్యక్తి వద్ద రూ.1,55,000 నుంచి రూ.1,70,000 వసూలు చేశాడు. కొంతకాలం తర్వాత తానే తయారు చేసిన ఆర్డర్ కాపీని డబ్బులు తీసుకొన్నవారికి అందించాడు. ఈ ఆర్డర్ కాపీపై అధికారుల సంతకాన్ని ఫోర్జరీ చేసి పెట్టాడు. దీంతో నిజమైన డబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్ గా అందరూ నమ్మారు. 

కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, బాచుపల్లి, మియాపూర్ ప్రాంతాల్లో పలువురిని ఆయన మోసం చేశాడు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందింది. దీంతో మాదాపూర్  ఎస్ఓటీ పోలీసులు ప్రశాంత్ గా గుర్తించారు. నిందితుడు ప్రశాంత్ ను సోమవారం నాడు అరెస్ట్ చేశారు అతని నుండి రూ.8 లక్షల నగదుతో పాటు కారు, ల్యాప్‌టాప్, కలర్‌ ప్రింటర్, ఎనిమిది డబుల్‌ బెడ్రూం కేటాయింపు నకిలీ లెటర్లు స్వాధీనం చేసుకున్నారు.

గతంలో కూడ నకిలీ సబ్ ఇన్స్‌పెక్టర్ గా నకిలీ గుర్తింపు కార్డును తయారు చేసి టోల్ గేట్ల వద్ద డబ్బులు చెల్లించకుండానే తిరుగుతుండడంతో నిందితుడిని భవానీపురం పోలీసులు ఈ ఏడాది జూన్ 24వ తేదీన అరెస్ట్ చేశారు.

జైలు నుండి విడుదలైన తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కూడ నిందితుడు మోసానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో దళారుల మాటలు విని మోసపోవద్దని సీపీ సజ్జనార్ సూచించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios